#ChiruAnil : ఏ ఒక్క ఛాన్స్ వదిలేలా లేడు

మెగాస్టార్‌ చిరంజీవి 'విశ్వంభర' సినిమా ఇంకా సెట్స్‌పైనే ఉంది. షూటింగ్‌ ప్యాచ్ వర్క్‌ బ్యాలన్స్ ఉన్నట్లు సమాచారం.;

Update: 2025-04-02 06:14 GMT
#ChiruAnil : ఏ ఒక్క ఛాన్స్ వదిలేలా లేడు

మెగాస్టార్‌ చిరంజీవి 'విశ్వంభర' సినిమా ఇంకా సెట్స్‌పైనే ఉంది. షూటింగ్‌ ప్యాచ్ వర్క్‌ బ్యాలన్స్ ఉన్నట్లు సమాచారం. మరో వైపు విశ్వంభర సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదిలోనే విశ్వంభర సినిమా రానుంది. ప్రస్తుతం విశ్వంభర కంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమాపై ఉంది. ఇటీవలే ఉగాది సందర్భంగా సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను సైతం పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందించేందుకు గాను స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశారని సమాచారం అందుతోంది. అతి త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కావచ్చు.

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విజయంలో పాటలు కీలక పాత్ర పోషిస్తే, పబ్లిసిటీ అంతకు మించి పని చేసింది అనడంలో సందేహం లేదు. పాటలను పబ్లిసిటీకి వాడుకున్న తీరు ఎంతో మందిని ఆశ్చర్యపరచింది. ఆ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని అందించాడు. ఇప్పుడు చిరంజీవి, అనిల్‌ రావిపూడి సినిమాకు సైతం భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందించబోతున్నాడు. ఆ విషయమై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. భీమ్స్ కొన్ని పాటలను సైతం ట్యూన్ చేసి రెడీగా ఉంచారని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని ఒక పాటను వెంకటేష్‌తో పాడించారు. అంతకు ముందు వెంకీ పాట పాడిన అనుభవం ఉండటంతో బ్లాక్ బస్టర్‌ పొంగల్‌ పాటను అద్భుతంగా పాడి అలరించాడు.

వెంకటేష్‌ పాట పాడటం అనేది పబ్లిసిటీకి బాగా హెల్ప్‌ అయింది. హీరోలు పాటలు పాడటం వల్ల పబ్లిసిటీ ఎక్కువగా దక్కుతుంది. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి గొంతు అద్భుతంగా ఉండి పాడించారని కాదు, వారు పాడితే సినిమా గురించి జనాల్లో చర్చ జరుగుతుంది. తద్వారా సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కుతాయి అనేది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే దర్శకులు, సంగీత దర్శకులు హీరోలతో పాటలను పాడించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చిరంజీవితో తెరకెక్కించబోతున్న సినిమా విషయంలో అనిల్‌ రావిపూడి ఏ ఒక్క ఛాన్స్‌ను వదలకుండా ప్రమోషన్స్‌ను ఎక్కువ చేయాలని భావిస్తున్నాడు. షూటింగ్‌ ప్రారంభం రోజే చేసిన వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది.

సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి వార్తల్లో ఉంచాలంటే అలాంటి వీడియోలను ఎప్పటికప్పుడు వదులుతూ ఉండాలి. అందుకే ఈ సినిమా కోసం చిరంజీవితో పాట పాడించాలనే నిర్ణయానికి వచ్చారు. 2026 సంక్రాంతికి సినిమా విడుదల కావడం నూటికి నూరు శాతం కన్ఫర్మ్‌. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కోసం చిరంజీవి పాట పాడటం వల్ల అంచనాలు మరింత పెరగడం ఖాయం. సినిమా ఆడియో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అనిల్‌ రావిపూడి భావిస్తున్నాడు. సినిమా విజయంలో పాటలు ఎంత కీలకమో ఆయనకు తెలుసు. అందుకే భీమ్స్‌ ను ఇప్పటి నుంచే పాటల రికార్డింగ్‌పై దృష్టి పెట్టమని చెప్పాడని సమాచారం.

సినిమాను ఎంత క్రియేటివ్‌గా, వినోదాత్మకంగా రూపొందించారో అదే తరహాలో ప్రమోషన్‌ చేస్తేనే జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ప్రమోట్‌ చేసిన తీరును ఈమధ్య కాలంలో చాలా సినిమాల మేకర్స్‌ ఫాలో అయ్యారు. కనుక చిరు సినిమా కోసం అనిల్ రావిపూడి మరింత క్రియేటివ్‌గా, వినోదాత్మకంగా ప్రమోషన్స్ చేసి రఫ్పాడించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. చిరంజీవికి సరి జోడిని అనిల్‌ రావిపూడి ఇప్పటికే ఎంపిక చేశారనే టాక్‌ వినిపిస్తుంది. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News