చిన్న హీరోకు చిరు సత్కారం
సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోలకు మద్దతు లభించడం లేదు అంటూ కొందరు మాట్లాడుతూ ఉంటారు.
సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోలకు మద్దతు లభించడం లేదు అంటూ కొందరు మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల కిరణ్ అబ్బవరం సైతం చిన్న సినిమాలను ప్రోత్సహించక పోగా కొందరు ట్రోల్స్ చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో ఒక సినిమాలో నాపై మీమ్ వేయడం చాలా బాధ వేసిందని, నేను హిట్ సినిమా తీసినప్పుడు ఎవరూ మద్దతు తెలపలేదు, ప్రోత్సహించలేదు అంటూ తన అసహనం వ్యక్తం చేయడం జరిగింది. తాజాగా ఏడాది కష్టపడి కిరణ్ అబ్బవరం 'క' సినిమాను చేసి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
'క' సినిమాకు మంచి స్పందన వచ్చింది. కేవలం మూడు రోజుల్లోనే సినిమాకు బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాంగ్ వీకెండ్ తో భారీ లాభాలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన 'క' సినిమా సక్సెస్ ఈవెంట్‌లో దిల్ రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని కిరణ్ అబ్బవరంతో పాటు చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఆ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ ఇక్కడ ఎవరు ఎవరికి మద్దతు తెలుపరు. హిట్ అయినప్పుడు మాలాంటి వాళ్లం వచ్చి అభినందిస్తాం అంటే తప్ప మంచి సినిమాలు చేయాల్సింది మీరే అంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.
కిరణ్ అబ్బవరం ఆనందం మరింత పెరిగే విధంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా 'క' యూనిట్ సభ్యులు అదరినీ తన ఇంటికి ఆహ్వానించారు. కిరణ్ అబ్బవరం ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి గారు దాదాపు గంట సమయం మా కోసం కేటాయించి మా సినిమా గురించి మాట్లాడారు. పేరు పేరున అభినందనలు తెలియజేశారు అంటూ కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి సంతోషం వ్యక్తం చేశాడు. 'క' సినిమా గురించి ప్రత్యేక ప్రశంసలు మెగాస్టార్ నుంచి రావడంతో మరింత వసూళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ వసూళ్లు సాధించిన ఈ సినిమాకు సెకండ్ వీకెండ్ లోనూ దిల్ రాజుతో పాటు తాజాగా చిరంజీవి వంటి స్టార్స్ ప్రోత్సాహం, ప్రశంసలు దక్కిన కారణంగా భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ ఏడాదిలో అత్యధిక లాభం పొందిన సినిమాల జాబితాలో క సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రూ.20 కోట్ల వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో మరో రూ.5 కోట్ల వసూళ్లు చేసినా రికార్డ్ స్థాయిలో లాభం ఉంటుందని తెలుస్తోంది. చిరు సన్మానం తో 'క' సినిమాకు మరింత లాభాలు వస్తాయని బయ్యర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు 'క' సినిమాను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.