యువభలంతో మెగా లైనప్!
చిరంజీవి కెరీర్‌లో సీనియర్ దర్శకులతో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ చేశారు. అయితే ఈ సారి మొత్తం యువతరాన్ని నమ్ముకుంటూ కొత్త జోనర్స్‌లో ప్రయోగాలు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే వంద కోట్ల క్లబ్‌లో వరుస హిట్లతో తన సత్తా చాటిన చిరు, ఇప్పుడు తన రాబోయే ప్రాజెక్టులతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన కొత్త ప్రాజెక్టుల వివరాలు బయటకు రావడంతో, ఫ్యాన్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. స్పెషల్ ఏమిటంటే, చిరంజీవి ఈసారి అందరి యువ దర్శకులతో పని చేయడం.
మెహర్ రమేష్ తో భోళా శంకర్ చేసిన అనంతరం మెగాస్టార్ పై ఓ వర్గం ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నేటితరం యువ దర్శకులకు సినిమాలు చేయండి అంటూ రిక్వెస్ట్ లు వచ్చాయి. దీంతో మెగాస్టార్ కూడా చాలా రోజులుగా యువ టాలెంట్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా ఇప్పుడు ఆయన సీనియర్ దర్శకుల కంటే లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అయ్యే మేకర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో "విశ్వంభర" చిత్రంలో మెగాస్టార్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. బింబిసారతో మంచి గుర్తింపు పొందిన వశిష్ట, ఈ సారితో మెగాస్టార్‌ను కొత్తగా ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాడు. కాస్త మైథలాజికల్ కాన్సెప్ట్ లో వస్తున్న ఈ కథకు సంబంధించిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌ను మరిచిపోలేని అనుభూతి కలిగించనుంది.
ఇక రాబోయే మరో ప్రాజెక్ట్ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై మరో యువ దర్శకుడు అనిల్ రావిపూడితో ఉండటం విశేషం. పటాస్ నుంచి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొడుతున్న అనిల్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆయన దర్శకత్వంలో చిరు ఈసారి కామేసి, డ్రామా కథలో కనిపించనున్నారు. అనిల్ మార్క్ కామెడీకి చిరు టైమింగ్ కలిస్తే, ఈ ప్రాజెక్ట్ మరో బిగ్గెస్ట్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందని అనిపిస్తుంది.
ఇక ఇటీవలే "దసరా"తో డైరెక్టర్‌గా తన సత్తా చాటిన శ్రీకాంత్ ఓదెల, ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా చేయబోతున్నారు. SLV సినిమాస్ మరియు యూనానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీకాంత్ తన తొలిచిత్రంలోనే గ్రౌండ్ బ్రేకింగ్ స్టోరీ టెల్లింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. చిరు సినిమా ద్వారా ఆయన మరింత ప్రత్యేకతను సాదిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అలాగే వెంకీ కుడుముల కూడా గతంలో మెగాస్టార్ తో సినిమా చేయాలని అనుకున్నప్పటికి ఎందుకో మళ్ళీ సెట్టవ్వలేదు. భవిష్యత్తులో సందీప్ రెడ్డి వంగా కూడా మెగాస్టార్ తో సినిమా చేస్తానని అన్నాడు. చిరంజీవి కెరీర్‌లో సీనియర్ దర్శకులతో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ చేశారు. అయితే ఈ సారి మొత్తం యువతరాన్ని నమ్ముకుంటూ కొత్త జోనర్స్‌లో ప్రయోగాలు చేస్తున్నారు. మరి యువ దర్శకులు మెగాస్టార్ ను ఎలా హైలెట్ చేస్తారో చూడాలి.