మిత్ర‌న్ తో మెగాస్టార్ చిరంజీవి పెద్ద ప్ర‌యోగ‌మో!

అయితే ఇప్పుడు మెగాస్టార్ కోలీవుడ్ డైరెక్ట‌ర్ మిత్ర‌న్ తో కూడా సినిమా చేస్తున్న‌ట్లు ఓ వార్త వెలుగులోకి వ‌చ్చింది.

Update: 2024-12-22 17:30 GMT

మెగాస్టార్ చిరంజీవి 156 `విశ్వంభ‌ర` ఆన్ సెట్స్ లో ఉంది. చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. అన్ని ప‌నులు పూర్తిచేసి స‌మ్మ‌ర్ లోగా రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. అలాగే 157 కూడా లాక్ అయింది. `ద‌స‌రా` ఫేం శ్రీకాంత్ ఓదెల‌తో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు అనీల్ రావిపూడి తో ప్రాజెక్ట్ కూడా ఫైన‌ల్ అయిన‌ట్లు మెగా కాంపౌండ్ వ‌ర్గాల నుంచి గ‌ట్టిగానే వినిపిస్తుంది. 157వ సినిమా అనీల్ తో ప‌ట్టాలెక్కినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. స‌మ్మ‌ర్ లో ఆ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌నే ప్లాన్ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ రెండు ప్రాజెక్ట్ లు కూడా మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకునే చేసే ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలు. శ్రీకాంత్ తో చేసే సినిమా కాస్త ఇన్నోవేటివ్ గా ఉండే అవ‌కాశం ఉంది త‌ప్ప‌! అనీల్ ప్ర‌త్యేక‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సీనియ‌ర్ల‌ను క‌మ‌ర్శియ‌ల్ గా ఎలా తీర్చి దిద్దాలో ఆయ‌న‌కు బాగా తెలుసు. స్టోరీ ప‌రంగా చిన్న పాటి లాజిక్ ల‌తో జ‌నాల‌కు సినిమాని ఎక్కించ‌డం అత‌డి ప్ర‌త్యేక‌త‌. అయితే ఇప్పుడు మెగాస్టార్ కోలీవుడ్ డైరెక్ట‌ర్ మిత్ర‌న్ తో కూడా సినిమా చేస్తున్న‌ట్లు ఓ వార్త వెలుగులోకి వ‌చ్చింది.

చిరంజీవికి మిత్ర‌న్ చెప్పిన స్టోరీ లైన్ న‌చ్చ‌డంతో బౌండెడ్ స్క్రిప్ట్ తో అప్రోచ్ అవ్వ‌మ‌ని సూచించారుట‌. ఇదే నిజ‌మైతే మెగాస్టార్ లో కొత్త కోణాన్ని చూడొచ్చు. మిత్ర‌న్ సినిమాలు రోటీన్ కి భిన్నంగా ఉంటాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లు తెర‌కెక్కించ‌డంలో మిత్ర‌న్ స్పెష‌లిస్ట్. విశాల్ తో తెర‌కెక్కించిన `ఇరుబుం తిరై` తెలుగులో అభిమన్యుడిగా రిలీజ్ అయి సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అటుపై శివ కార్తికేయ‌న్ తో `హీరో` తెర‌కెక్కించారు. ఈ రెండు మంచి విజ‌యం సాధించాయి.

అనంత‌రం కార్తీతో స్పై థ్రిల్ల‌ర్ ` స‌ర్దార్ `తెర‌కెక్కించి మ‌రో భారీ విజ‌యం అందుకున్నారు. ప్రస్తుతం కార్తీతో `స‌ర్దార్ -2` తెర‌కెక్కిస్తున్నారు. అలాంటి మిత్ర‌న్ ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నార‌నే ప్ర‌చారం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇదే నిజ‌మైతే మెగాస్టార్ వెండి తెర‌పై కొత్త కోణంలో చూడొచ్చు. మెగాస్టార్ క‌మ‌ర్శియ‌ల్ మాస్ క‌థ‌ల‌తో పాటు వైవిథ్య‌మైన క‌థ‌ల‌పైనా ఆస‌క్తి చూపిస్తున్నారు. `సైరా న‌ర‌సింహారెడ్డి`,` గాడ్ ఫాద‌ర్` లాంటి సినిమాల‌తో అది రుజువైంది. ఈ నేప‌థ్యంలో మిత్ర‌న్ ని కూడా లైన్ లోకి తెస్తున్నారంటే? ఇద్ద‌రు పెద్ద ప్ర‌యోగానికే తెర తీసిన‌ట్లు క‌నిపిస్తుంది.

Tags:    

Similar News