మెగాస్టార్ ముందు పెద్ద టార్గెట్!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. ఈ నలుగురు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు స్థంభాల వంటి వారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకానొక సమయంలో వీరు నలుగురి సినిమాలు టాలీవుడ్‌ని నిలబెట్టాయి. దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్ అంటే వీరి సినిమాలు అన్న స్థాయిలో వరుస రిలీజ్‌లు ఉండేవి, ఇండస్ట్రీ హిట్స్ ఉండేవి. రికార్డ్‌లు, హిట్స్ అన్నీ ఈ నలుగురి ఖాతాలోనే ఉండేవి. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. తర్వాత జనరేషన్ హీరోలు రావడంతో ఆ నలుగురు హీరోలు వారితో పోటీ పడటంలో కాస్త వెనుక పడ్డారు అనక తప్పదు.
ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే బ్యాక్ టు బ్యాక్ విజయాలు సొంతం చేసుకుంటున్నారు, వారి సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. సినిమా ఫలితం తారుమారు అయినా వసూళ్లు ఒక మోస్తరుగా వీరిద్దరూ మాత్రమే రాబడుతున్నారు అనే అభిప్రాయం ఉండేది. సీనియర్ స్టార్ హీరోల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హీరోగా చిరంజీవి నిలువగా, అత్యధిక వంద కోట్ల సినిమాలు ఉన్న హీరోగా కూడా చిరంజీవి నిలిచారు. అందుకే సీనియర్ స్టార్ హీరోల్లో అప్పటిలాగే ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి నెం.1 అనే అభిప్రాయం ఉంది. మెగా ఫ్యాన్స్ సైతం అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రముఖంగా చర్చించుకుంటూ ఉంటారు.
చిరంజీవి అత్యధిక వసూళ్లు సాధించిన సీనియర్ స్టార్ హీరోగా నెం.1 స్థానంలో ఇన్నాళ్లు ఉంటే ఇప్పుడు ఆ స్థానం నెం.2 కి పడిపోయింది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా రూ.300+ కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకు చిరంజీవి సినిమాలు ఈ నెంబర్‌ను టచ్ చేయలేక పోయాయి. దాంతో అత్యధిక వసూళ్లు రాబట్టిన సీనియర్ హీరోగా వెంకటేష్ నెం.1 స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా ఈ రికార్డ్‌ను బ్రేక్ చేయాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న విశ్వంభర సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతుంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాను 'విశ్వంభర' సినిమా బ్రేక్ చేస్తుందనే నమ్మకంను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆ రికార్డ్‌ను విశ్వంభర చేరుకోలేక పోతే ఆ వెంటనే చిరంజీవి తదుపరి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉంటుంది. 2026 సంక్రాంతికి చిరు, అనిల్ మూవీ రానుంది. కనుక ఆ సమయంలో అయినా కచ్చితంగా చిరంజీవి ఆ నెం.1 స్థానంను మళ్లీ దక్కించుకుంటాడా అనేది చూడాలి. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమాను చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 సినిమా ఏమైనా వెంకీ దక్కించుకున్న రూ.300 కోట్ల వసూళ్ల రికార్డ్‌ని బ్రేక్ చేసేనా చూడాలి.