'విశ్వంభర'లో ఏఐ మాయ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే దీనిపై అనేక రకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.;

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే దీనిపై అనేక రకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా ఎనౌన్స్ చేసినప్పుడు పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. ఎందుకంటే దర్శకుడు వశిష్ట మొదటి సినిమా బింబిసారతో మ్యాజిక్ క్రియేట్ చేయడంతో ఫ్యాన్స్ లో మంచి నమ్మకం ఏర్పడింది. అయితే ఫస్ట్ టీజర్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆశించిన విధంగా విజువల్స్ కనిపించకపోవడంతో పెద్దగా స్పందన రాలేదు.
అయితే, ఇప్పుడు ఈ టీజర్‌కి సంబంధించి ఓ షాకింగ్ రివలేషన్ బయటకి వచ్చింది. టీజర్‌లో కనిపించిన దృశ్యాలు అసలు వీఎఫ్ఎక్స్ ద్వారా కాదట… ఏఐ ద్వారా రూపొందించారట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. వాస్తవానికి టీజర్ విడుదల సమయంలో చిత్రం వీఎఫ్ఎక్స్ పనులు పూర్తవ్వలేదట.
ఎప్పటికైనా సంక్రాంతికి సినిమా తీసుకురావాలన్న ఆలోచనతో, తాత్కాలికంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టూల్స్ ఉపయోగించి కొన్ని విజువల్స్ క్రియేట్ చేశారట. వాటినే టీజర్‌కి వాడారన్నమాట. వీడియో గ్రాఫిక్స్ కంపెనీలను సంప్రదించిన నిర్మాతలు, మొదట మూడు నెలల్లో వీఎఫ్ఎక్స్ అందిస్తామని చెప్పినా, చివరికి ఆరు నెలలు గడిచినా ఫలితం కనిపించలేదట.
దీంతో, సినిమాకి హైప్ తగ్గకుండా ఉండాలని, టీజర్ రెడీ చేయాల్సి వచ్చిందట. అప్పుడే ఏఐ టెక్నాలజీని ట్రై చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇది విమర్శలకు తావిచ్చిందని ఆయన తెలిపారు. టీజర్‌కు వచ్చిన బ్యాక్లాష్ చూసిన తర్వాత, మేకర్స్ వెంటనే ఎలాంటి షార్ట్ కట్ కి వెళ్లకూడదని స్పష్టంగా నిర్ణయించుకున్నారట. ఇకపై పూర్తి స్థాయిలో వీఎఫ్ఎక్స్ పైనే ఆధారపడతామని, ఏఐ టూల్స్‌ను పూర్తిగా తప్పించామని ఆయన వెల్లడించారు.
ఈ విషయంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే టీజర్ చూసిన తర్వాత సినిమా ప్రమాణాలు దిగజారిపోయాయన్న భావన నెలకొంది. ఇప్పుడు ఈ క్లారిటీతో మళ్లీ అంచనాలు బలపడుతున్నాయి. ఇక 'విశ్వంభర' సినిమాపై ఉన్న ఆసక్తి తారాస్థాయిలోనే ఉంది. దర్శకుడు వశిష్ఠ ‘బింబిసార’ సినిమాతో తన సత్తా చాటిన తర్వాత, చిరంజీవితో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడం విశేషం.
ఈ సినిమాలో త్రిష, అశికా రంగనాథ్, కునాల్ కపూర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. మొత్తానికి ‘విశ్వంభర’ టీజర్ మీద వచ్చిన అసంతృప్తి వల్లే మేకర్స్ మరింత కసిగా పనిచేస్తున్నారని, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడట్లేదని తెలుస్తోంది. ఇప్పుడు అసలు సినిమా ఎలా ఉండబోతుందనేది చూసేంతవరకూ అభిమానుల్లో చర్చ ఆగేలా కనిపించడం లేదు. టీజర్‌లో ఏఐ కనిపించినా, ఫుల్ మూవీ మాత్రం మెగా విజువల్ ఫీస్ట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.