బ్రహ్మానందం `నేను`కు మెగాశీస్సులు
మునుపటిలా ప్రతి సినిమాలో నటించేందుకు వయసు రీత్యా సమస్యలు అడ్డంకిగా మారి ఉండొచ్చు.
హాస్య బ్రహ్మీ బ్రహ్మానందం గురించి పరిచయం అవసరం లేదు. ఆయన తెరపై అలా కనిపిస్తే చాలు.. ముఖంపై చిరునవ్వు మెదలాల్సిందే. వందలాది సినిమాల్లో ఎన్నో పాత్రలతో మనల్ని నవ్వించిన గొప్ప హాస్య నటుడు ఆయన. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఇటీవల చాలా పరిమితంగా మాత్రమే సినిమాల్ని ఎంపిక చేసుకుంటున్నారు.
మునుపటిలా ప్రతి సినిమాలో నటించేందుకు వయసు రీత్యా సమస్యలు అడ్డంకిగా మారి ఉండొచ్చు. ఒక సామాన్యుడి నుంచి స్టార్ కమెడియన్గా ఎదిగిన ఆయన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. తన సినీకెరీర్ ప్రయాణం, అనుభవాల గురించి ఇటీవల `నేను` అనే పుస్తకాన్ని రాసి మార్కెట్లో రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందంకు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు. తనను అత్యంత సన్నిహిత వ్యక్తిగా పేర్కొంటూ, పుస్తకంపై తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. బ్రహ్మానందం తన అనుభవాలు, తాను కలిసిన వ్యక్తులు, ఇతర అవగాహనలు మొదలైన వాటి గురించి పుస్తకంలో రాశారని తెలిపారు. ఈ పుస్తకం పాఠకులందరికీ స్ఫూర్తిదాయకమని నమ్ముతున్నానని ఆయన అన్నారు. చిరు శాలువా కప్పి బ్రహ్మానందాన్ని సత్కరించిన వీడియో వైరల్ గా మారుతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ చిరంజీవి ఈ సత్కారంలో పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ ఖాతాలో బ్రహ్మీ గురించిన వ్యాఖ్యానం సారాంశం ఇలా ఉంది.
'నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు , తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో మనకందించటం ఎంతో ఆనందదాయకం.
తానే చెప్పినట్టు ‘ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు, మార్గదర్శకము అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని , వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ పుస్తక ప్రచురణ కర్తలయిన `అన్వీక్షికి` వారిని అభినందిస్తున్నాను..`` అని అన్నారు.