చిరుకి ప‌ద్మ‌విభూష‌ణ్.. సెల‌బ్రిటీల అభినంద‌న‌లు

నాలుగు దశాబ్దాల కెరీర్‌లో మెగాస్టార్ చిరంజీవి భారతీయ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరిగా ఉన్నారు.

Update: 2024-01-26 06:08 GMT

నాలుగు దశాబ్దాల కెరీర్‌లో మెగాస్టార్ చిరంజీవి భారతీయ చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరిగా ఉన్నారు. భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను ఆయ‌న‌ను ఎన్నో పుర‌స్కారాలు వ‌రించాయి. ఇప్ప‌టికే ఆయ‌న ప‌ద్మ‌భూష‌ణుడు అయ్యారు. ఇంత‌లోనే ఈ ఏడాది కేంద్రం నుంచి ఆయ‌న‌కు పద్మ విభూషణ్ లభించింది. అసాధారణమైన విశిష్టమైన సేవకు లభించే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో ఈ ఏడాది స‌త్కారం అందుకున్న ఐదుగురిలో చిరంజీవి ఒక‌రిగా ప్ర‌క‌టించారు. ఇంత‌టి గొప్ప గౌరవానికి కృతజ్ఞతలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియాల్లో ఆనందం వ్య‌క్తం చేసారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, జూనియ‌ర్ ఎన్టీఆర్, చిరంజీవి స‌హ‌న‌టులైన‌ ఎయిటీస్ స్టార్స్, రాజ‌కీయ, పారిశ్రామిక రంగాల నుంచి ప‌లువురు సోషల్ మీడియాలో చిరుకి శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు లభించిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ లు చిరంజీవిని అభినందించారు. ''ఎక్కడి నుంచో.. భారతదేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం గ్రహీత కావడానికి `పునాదిరాళ్ల`కు తొలి రాయి వేసిన బాలుడు... మీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది చిరంజీవి గారూ. పద్మవిభూషణ్ అందుకున్నందుకు అభినందనలు`` అని రాజ‌మౌళి ట్వీట్ చేశారు.

తారక్ తన నోట్‌లో ఎం.వెంకయ్య నాయుడు, చిరంజీవిల‌ను అభినందించారు. ''పద్మ విభూషణ్ అందుకున్నందుకు ఎం.వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారూ అభినందనలు!`` అని జూనియర్ ఎన్టీఆర్ రాశారు. పద్మభూషణ్, పద్మ విజేతలను కూడా ఆయన అభినందించారు.''అలాగే, పద్మ అవార్డులు అందుకున్న వారందరికీ అభినందనలు. మీ అద్భుతమైన విజయం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది`` అని తార‌క్ రాశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా విజేతలకు అభినందనలు తెలిపారు. X ఖాతాలో PM మోడీ ఇలా అన్నారు. ``పద్మ అవార్డులు పొందిన వారందరికీ అభినందనలు. విభిన్న రంగాలలో వారి సహకారాన్ని భారతదేశం గౌరవిస్తుంది. వారంతా తమ అసాధారణమైన పనితో ప్రజలను ప్రేరేపించడాన్ని కొనసాగించాలి`` అని అన్నారు.

మమ్ముట్టి X ఖాతాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసారు. ''పద్మ విభూషణ్ అందుకున్న ప్రియమైన చిరు భాయ్ కి హృదయపూర్వక అభినందనలు'' అని రాశారు. నేచుర‌ల్ స్టార్ నాని ఎక్స్ ఖాతాలో అభినందన సందేశాన్ని ఇలా రాశారు. ``గుడ్ మార్నింగ్ పద్మవిభూషణ్ చిరంజీవి గారూ`` అని సింపుల్ గా కోట్ చేసారు.

ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియో కామెంట్ విభాగంలో ఉపాసన కొణిదెల తన మామగారికి శుభాకాంక్షలు తెలుపుతూ- ``యు ఆర్ జస్ట్ అమేజింగ్`` అని రాశారు.

ఎయిటీస్ క్లాసిక్ ఫ్రెండ్స్ అంతా మెగాస్టార్ చిరంజీవికి త‌మ‌ అభినంద‌న‌లు తెలియ‌జేసారు. నాటి మేటి క‌థానాయిక‌, రాజ‌కీయ నాయ‌కురాలు ఖుష్బు సుందర్ చిరంజీవికి హృదయపూర్వక సందేశాన్ని పంపారు. ఖుష్బూ ఇలా రాశారు. ''సార్ చిరంజీవి గారూ, మీకు లభించిన గౌరవానికి చాలా అభినందనలు. మీరు దానికి అర్హులు. సినిమా, కళా ప్రపంచానికి, మీ దాతృత్వ జీవనశైలికి మీ సహకారం, మీ మంచితనానికి ద‌క్కిన గౌర‌వ‌మిది. ప్రజల కోసం పని చేయండి.. మీ పెద్దల ఆశీర్వాదం మీకు దీన్ని తెస్తుంది. ఒక స్నేహితురాలిగా, అమితంగా ఆరాధించే గౌరవించే వ్యక్తిగా మిమ్మల్ని #పద్మవిభూషణ్‌తో సత్కరించడం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. మీకు టన్నుల కొద్దీ శుభాకాంక్షలు.. హృదయపూర్వక నమస్కారాలు పంపుతున్నాను. మీ గురించి చాలా గర్వంగా ఉంది`` అని ఎమోష‌న‌ల్ నోట్ రాసారు.

ఇతరుల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కూడా చిరంజీవిని అభినందించారు. చిరుతో పాటు పద్మవిభూషణ్ అవార్డు పొందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కూడా ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు. ''భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు .. మెగా స్టార్ శ్రీ చిరంజీవి గారు తమ తమ రంగాలలో అసమానమైన సేవలందించినందుకు ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డు పొందినందుకు హృదయపూర్వక అభినందనలు. వారిద్దరూ కృషి, దృఢ సంకల్పంతో విజయానికి బాటలు వేశారు. అచంచలమైన క్రమశిక్షణ - చాలా మందికి ప్రేరణగా మారింది`` అని చంద్ర‌బాబు నాయుడు X లో రాశారు. ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డు గ్రహీతలలో పాప్ మ్యూజిక్ క్వీన్ ఉషా ఉతుప్ , నటుడు విజయకాంత్ ఉన్నారు.

Tags:    

Similar News