చిరుకి సన్మానం.. అదే వేదికపై నందుల ప్రకటన?
ఇప్పుడు వాటన్నిటినీ తెలుగు సినీపరిశ్రమ స్మరించుకుంటోంది. ఏపీకి కొత్త ప్రభుత్వం వచ్చింది. కూటమి కొలువు దీరింది.
గత వైకాపా ప్రభుత్వం సినీపరిశ్రమను, పరిశ్రమకు అందాల్సిన 'నంది' అవార్డుల్ని పూర్తిగా విస్మరించిందన్న విమర్శలున్నాయి. జగన్ పాలనలో పరిశ్రమకు కక్ష సాధింపులు, సినీపెద్దలకు అవమానాలు ఎదురయ్యాయి. ఇప్పుడు వాటన్నిటినీ తెలుగు సినీపరిశ్రమ స్మరించుకుంటోంది. ఏపీకి కొత్త ప్రభుత్వం వచ్చింది. కూటమి కొలువు దీరింది. ఇప్పుడు కూటమి విజయాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పెద్దల్ని కలిసేందుకు సినీపరిశ్రమ ఉత్సాహంగా ఉంది. పలువురు సినీపెద్దలు నిన్న విజయవాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో టాలీవుడ్ సమస్యల గురించి సినీపెద్దలు చర్చిస్తారని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ లేదని కొత్త ప్రభుత్వ పెద్దలతో సద్భావనా సమావేశం మాత్రమే నిర్వహించామని సినీపెద్దలు వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా రెండు ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. సినీపరిశ్రమకు 2016 నుంచి ఎలాంటి ప్రభుత్వ పురస్కారాల్ని అందజేయలేదు. వీటన్నిటినీ ప్రకటించేందుకు ఇప్పుడు కూటమి(తేదేపా-జనసేన-భాజపా) ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిసింది. 2016 నుంచి ఇవ్వాల్సిన నందులను ఏకమొత్తంగా ప్రకటించే వీలుందని సమాచారం. అలాగే ఇదే వేదికపై పద్మవిభూషణుడు మెగాస్టార్ చిరంజీవిని సన్మానించుకోవాలని భావిస్తున్నట్టు గుసగుస వినిపిస్తోంది.
అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇంతకుముందు దేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా సన్మానించుకుంది. కానీ ఏపీలో వైకాపా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదు. పైగా చిరు సినీపెద్దగా తాడేపల్లి గూడెంలో జగన్ ని కలిసేందుకు విచ్చేస్తే, అతడిని చాలా దూరం నడిపించి అవమానించిన సంగతిని సినీపరిశ్రమ మరువలేదు. కానీ ఇప్పటి కొత్త ప్రభుత్వం చిరును సన్మానించుకునేందుకు గౌరవించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుత ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇంతకుముందు మెగాస్టార్ ని ఆయన నివాసంలో గౌరవార్థకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ సోమవారం నాడు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో సినీపెద్దల భేటీలోను కందుల ఉన్నారు.