మెగాస్టార్ సారథ్యంలో ఔత్సాహిక ఫిలింమేకర్స్ కోసం?
ఈ ఉత్సవానికి తెలుగు సినిమా లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
సినీ పరిశ్రమకు రావాలనుకునే ఔత్సాహిక ఫిలింమేకర్స్, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు పరిశ్రమలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఒక వేదిక అవసరం. అయితే అరుదుగా అలాంటి అవకాశాలు అవార్డుల ఈవెంట్లలో వస్తుంటాయి. అలాంటి ఒక వేదిక ఇది అని చెబుతున్నారు సౌతిండియా ఫిలింఫెస్టివల్ నిర్వాహకులు. ఆహా ఓటీటీ- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ ఉత్సవానికి తెలుగు సినిమా లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ను అందుకున్న చిరంజీవిని గౌరవించుకుంటూ ఆయన సారథ్యంలోనే ఈ వేడుకలు సాగనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చేరికతో ఈ ఉత్సవం పరవళ్లు తొక్కుతుందనడంలో సందేహం లేదు. పరిశ్రమలో అంకితభావం తపనతో ఎదిగిన ఒక గొప్ప స్టార్ కి అరుదైన గౌరవ వేదికగా ఇది మారనుంది.
ఔత్సాహిక దర్శకనిర్మాతలు, కళాకారులు, సాంకేతిక నిపుణులు, సినీ ప్రముఖులకు ఈ ఉత్సవం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెబుతున్నారు.. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ లో సినిమాల ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ చర్చలు, ఔత్సాహిక ఫిలింమేకర్స్ ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక ప్యానెల్‌లతో కూడిన శక్తివంతమైన వేదికను అందిస్తుంది. కొత్త ప్రతిభావంతులు వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి పరిశ్రమ పరిజ్ఞానాన్ని ఒకరి నుంచి ఒకరు బదిలీ చేసుకునేందుకు సహకరించుకునేందుకు ఇది స్నేహపూర్వక వాతావరణాన్ని ఇస్తుందని కూడా తెలుస్తోంది.
ఇది రొటీన్ కి భిన్నంగా పరిశ్రమలో ఎదిగేందుకు ప్రయత్నించే ప్రతిభావంతులు వృద్ధి చెందడానికి ఈ వేడుక సహకరిస్తుంది. 22 మార్చి 2024 న ఈ వేడుకలు ఘనంగా, కొంత విభిన్నంగా జరగనున్నాయి. అల్లు అరవింద్, విశ్వ ప్రసాద్, శైలేష్ ఆర్ సింగ్, దీపక్ ధర్, సుజయ్ రే, శేతాన్షు దీక్షిత్, మయాంక్ శేఖర్, రాజీవ్ మసంద్ వంటి విభిన్న ప్రతిభావంతులతో ఔత్సాహిక ఫిలింమేకర్స్ చర్చించేందుకు కూడా ఈ పండుగలో అవకాశం కల్పిస్తారని సమాచారం.