మెగాస్టార్ కోటి..భువ‌నేశ్వ‌రి రెండు కోట్లు విరాళం

ఏపీ, తెలంగాణ‌కు చెరో రూ. 50ల‌క్ష‌ల చొప్పున కేటాయించారు.

Update: 2024-09-04 07:01 GMT

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి తెలుగు రాష్ట్రాల‌కు విరాళాల వ‌ర‌ద కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎన్‌టీఆర్‌, మ‌హేశ్ , అశ్వీనీద‌త్, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, విశ్వ‌క్ సేన్, న‌టి అనన్య నాగ‌ళ్ల‌ త‌దిత‌రులు వ‌ర‌ద స‌హాయ నిధికి విరాళాలు ప్ర‌క‌టించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి త‌న దాతృహృ దయాన్ని చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాల‌కు రూ.కోటి విరాళం ప్ర‌క‌టించారు. ఏపీ, తెలంగాణ‌కు చెరో రూ. 50ల‌క్ష‌ల చొప్పున కేటాయించారు. దీనికి సంబంధించి ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు.

`తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనంద రం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది.

ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను` అని రాసుకొచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువనేశ్వరి కూడా రెండు తెలుగు రాష్ట్రాల‌కు రూ. 2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ తరఫున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ. కోటి చొప్పున విరాళం అందించారు.

ఈ సంద‌ర్భంగా భువ‌నేశ్వ‌రి మాట్లాడుతూ `కష్ట స‌మ‌యంలో ప్రజలకు అండగా నిలబడాలి. సంక్షోభంలో బాధితులకు అండగా ఉండడమే మనం వారికి చేసే అతిపెద్ద సాయం. తెలంగాణ, ఆంధ్రాల్లో వచ్చిన వరదలు చాలా మంది జీవితాల‌ మీద ప్రభావం చూపించాయి. వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోయి ఎంతో మంది ఇక్క‌ట్లు పడుతున్నారు.

బాధిత ప్రాంతాలు, ప్రజలకు అందించే సహకారంలో మేం చేసిన ఈ సాయం వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నాం. అందుకే ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళాన్ని ప్రకటించడం జ‌రిగింది. వరద ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు మా పూర్తి మద్దతు ఉంటుంది` అని అన్నారు.

Tags:    

Similar News