'విశ్వంభర'.. అలాంటి నిర్ణయం తీసుకున్నారా?
మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు కానీ, దొరికిన ఈ సమయాన్ని మాత్రం బెటర్ విఎఫ్ఎక్స్ కోసం వినియోగించుకుంటున్నారని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''విశ్వంభర''. 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈపాటికి టాలీవుడ్ లో ఈ సినిమా హంగామా కనిపిస్తూ ఉండేది. ఎందుకంటే ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీఖున రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటం.. రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' రేసులోకి రావడంతో చిరు వెనక్కి తగ్గారు. మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు కానీ, దొరికిన ఈ సమయాన్ని మాత్రం బెటర్ విఎఫ్ఎక్స్ కోసం వినియోగించుకుంటున్నారని తెలుస్తోంది.
'విశ్వంభర' అనేది ఒక సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్. పంచభూతాలు, త్రిశూల శక్తి అనే అంశాలకు ఆధ్యాత్మికతను జోడించి సరికొత్త కథాంశంతో ఈ సినిమా తీస్తున్నారు. జోనర్ కు తగ్గట్టుగానే ,మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కు అధిక ప్రాధాన్యత ఉంది. అయితే ఇప్పటికే రిలీజైన టీజర్ లో విఎఫ్ఎక్స్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అమీర్ పేట్ గ్రాఫిక్స్ కన్నా దారుణంగా ఉన్నాయంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు చేసారు. చిన్న టీజర్ లోనే ఇలా ఉంటే, మొత్తం సినిమాలో విజువల్స్ ఎలా ఉంటాయో అని ట్రోల్ చేసారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పుడు క్వాలిటీ విజువల్స్ అందించడం మీద దృష్టి పెట్టారని తెలుస్తోంది.
ఇంతకముందు 'విశ్వంభర' సినిమా గ్రాఫిక్స్ కోసం వర్క్ చేసిన టీమ్ ని పక్కన పెట్టి, ఇప్పుడు మరో వీఎఫ్ఎక్స్ స్టూడియోతో పని చేయిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా బెటర్ విజువల్స్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారని అంటున్నారు. టీజర్ కు సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకొని, చిరంజీవి సూచనల మేరకే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దీని కోసం అదనంగా ఇంకొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
గతంలో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. టీజర్ రిలీజైన తర్వాత వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉన్నాయని, ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఇలాంటి నాసిరకమైన గ్రాఫిక్స్ తో వచ్చారని ట్రోల్ చేసారు. ఈ ఫీడ్ బ్యాక్ తో మేకర్స్ రిలీజ్ వాయిదా వేసుకొని మరీ, వీఎఫ్ఎక్స్ మీద రీవర్క్ చేసారు. అయినా సరే లాభం లేకుండా పోయింది. కంటెంట్ నచ్చకపోవడంతో జనాలు ఈ సినిమాని రిజెక్ట్ చేసారు. అయితే ఇప్పుడు ''విశ్వంభర'' సినిమా రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, బెస్ట్ అవుట్ ఫుట్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
'విశ్వంభర' సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష కృష్ణన్ నటిస్తోంది. ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా, ఏ.ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. 2025 సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.