చిరుతో 'ఠాగూర్' లాంటి సినిమా.. క‌న్ఫ‌మ్ చేసిన రైట‌ర్‌!

దర్శక రచయిత బీవీఎస్‌ రవి ఆదివారం.. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

Update: 2024-10-28 06:47 GMT

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీని తర్వాత చిరు చేయబోయే సినిమా గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే 'గాడ్ ఫాదర్' ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వంలో మరో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, బీవీఎస్‌ రవి కథతో ఈ సినిమా రూపొందనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని రచయిత కన్ఫర్మ్ చేసారు. తాను చిరంజీవితో సినిమా ప్లాన్‌ చేస్తున్నట్టు బీవీఎస్‌ రవి స్వయంగా వెల్లడించారు.

దర్శక రచయిత బీవీఎస్‌ రవి ఆదివారం.. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ''ఆహా ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్‌’ షో సీజన్-4 మొదలైంది. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా గత మూడు సీజన్ల నుంచి దిగ్విజయంగా కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా 4వ సీజన్‌ ఫస్ట్ ఎపిసోడ్‌ చేసారు. అది మంచి విజయం అందుకున్న సందర్భంగా.. ఇలాంటి షోలు సినిమాలు చేయడానికి బలాన్ని అందివ్వమని అడగడానికి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చాను'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఆయన తదుపరి సినిమాలపై స్పందించారు.

''చిరంజీవి, రవితేజతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాను. ‘విశ్వంభర’ పూర్తయిన తర్వాత చిరుతో మేం సినిమా చేస్తాం. సోషల్ టాపిక్, ప్రజలకు ఉపయోగపడే అంశం మీద ఆ సినిమా ఉంటుంది. చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్‌ అన్నీ ప్రేక్షకులు చూసేశారు. ఆయన సామాజిక అంశాలతో సినిమాలు తీస్తే జనాలు ఆదరించారు.. ఆయన్ని ఎంతో గౌరవించారు. ఎప్పుడు కూడా సీనియర్ హీరోలు సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమాలు చేస్తే ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. వాళ్ళు చెప్తే జనం వింటారు. అలాంటివి ఎక్కువ మందికి తెలుస్తుంది. అదే ఉద్దేశ్యంతో మేం కూడా ఆయనతో అలాంటి ప్రయత్నమే చేస్తున్నాం. చిరంజీవి నటించిన 'ఠాగూర్' 'ఇంద్ర' సినిమాల్లో సోషల్ టాపిక్ ఉంటుంది. ‘అన్‌స్టాపబుల్‌’ షోలోనూ ఎప్పుడూ ఓ సోషల్ టాపిక్ ఉంటుంది'' అని రవి అన్నారు.

ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథ, మాటలు అందించి మంచి రైటర్ గా పేరు తెచ్చుకున్న బివిఎస్ రవి.. ‘వాంటెడ్‌’ సినిమాతో మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. గోపీచంద్ హీరోగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత ఆరేళ్ళ గ్యాప్ తీసుకొని సాయి దుర్గ తేజ్‌ హీరోగా చేసిన ‘జవాన్‌’ మూవీ సైతం పరాజయం పాలైంది. అక్కినేని నాగచైతన్య నటించిన 'థాంక్యూ' సినిమాకి రవి కథ అందించారు. 'రానా నాయుడు' వెబ్ సిరీస్ కు కూడా వర్క్ చేసారు. ప్రొడ్యూసర్ గానూ ఒకటీ రెండు సినిమాలు చేసిన బీవీఎస్ రవి.. క్రాక్‌, ధమాకా, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, మిస్టర్‌ బచ్చన్‌ వంటి చిత్రాల్లో నటించారు.

ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్‌ స్టాపబుల్‌ విత్ NBK’ టాక్ షోకి B.V.S. రవి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ కార్యక్రమం నాలుగో సీజన్ ప్రారంభమైంది. రాబోయే రెండు, మూడు నెలలపాటు అన్‌స్టాపబుల్‌ వర్క్‌తోనే బిజీగా ఉంటానని రవి చెబుతున్నారు. ప్రస్తుతం ఓ హిందీ చిత్రానికి స్క్రీన్ రైటర్ గా చేస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో చిరంజీవి సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే.. బలమైన సోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మెగా డాటర్ సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తారని టాక్. కొత్త ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News