తనపై కుట్ర చేసారని జానీ మాస్టర్ ఆవేదన
పోలీసుల విచారణలో జానీ మాస్టర్ తనపై కుట్ర జరిగిందని ప్రత్యారోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ లో 150 పైగా పాటలకు నృత్య దర్శకత్వం వహించి, తన ప్రతిభకు జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును అందుకున్న ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ రాంగ్ రీజన్ తో ఇటీవల మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మాలీవుడ్ ని ఓ ఊపు ఊపుతున్న `జస్టిస్ హేమ కమిటీ నివేదిక` అనంతరం టాలీవుడ్ లోను మీటూ సెకండ్ వేవ్ మొదలైంది. ఇక్కడ తొలిగా జానీ మాస్టర్ పై పెద్ద ఫిర్యాదు అందింది. అతడి సహాయకురాలు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు తనపై పలుమార్లు అత్యాచారం చేసాడని జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేయడం, అనంతరం పోలీసులు అరెస్టు చేసి విచారించడం తెలిసిందే.
పోలీసుల విచారణలో జానీ మాస్టర్ తనపై కుట్ర జరిగిందని ప్రత్యారోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తనపై కొందరు కుట్ర చేసారని జానీ ఆరోపించినట్టు తెలిసింది. అలాగే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా వేధించిందని జానీ మాస్టర్ ప్రత్యారోపణలు చేసారని కథనాలొస్తున్నాయి.
ఆ యువతి తీరుతో తనకే పెద్ద తలనొప్పి ఎదురైందని అతడు ఆవేదన చెందాడని తెలుస్తోంది. యువతి మైనర్ గా ఉన్నప్పుడు అత్యాచారం చేసానని ఆరోపించిన దాంట్లో అసలు నిజం లేదని అతడు పోలీసులకు చెప్పినట్టు కథనాలొస్తున్నాయి. తనపై ఆరోపణలు నిరాధారమైనవని జానీ విచారణలో అన్నారట. ఈ నిరాధారమైన ఆరోపణల వెనక ఉన్న వ్యక్తులు వేరు అని, తనపై కావాలనే కుట్ర చేసారని జానీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.