'క్రిస్మస్' సినిమాల సంగతేంటి?
మొదట్లో భారీ అంచనాలు ఉన్న పలు మూవీస్ రిలీజ్ అవుతాయని అనుకున్నా.. ఆయా చిత్రాలు పక్కకు తప్పుకున్నాయి.
ఏటా పండుగలకు సినిమాలు కచ్చితంగా రిలీజ్ అవుతాయన్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా క్రిస్మస్ కు బాక్సాఫీస్ వద్ద వివిధ చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఈసారి కూడా పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదట్లో భారీ అంచనాలు ఉన్న పలు మూవీస్ రిలీజ్ అవుతాయని అనుకున్నా.. ఆయా చిత్రాలు పక్కకు తప్పుకున్నాయి.
నాగచైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్.. క్రిస్మస్ కానుకగా రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డాయి. 2025లో అవి విడుదల అవ్వనున్నాయి. దీంతో ఈ సారి క్రిస్మస్ కు పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. వాటిలో రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొల్పలేదని ఈజీగా చెప్పవచ్చు.
నిజానికి గత వారం నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా.. అల్లరి నరేష్ బచ్చల మల్లి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లరి నరేష్ తన యాక్టింగ్ తో అదరగొట్టగా.. ఓవరాల్ గా సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. సినీ ప్రియులను అలరించలేకపోయింది బచ్చల మల్లి.
కోలీవుడ్ డబ్బింగ్ మూవీ విడుదల సీక్వెల్ విడుదల-2, సూపర్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ముఫాసా కూడా ఊహించిన విధంగా హిట్స్ కాలేకపోయాయి. కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర యూఐ మూవీ.. మోస్తరు వసూళ్లను రాబడుతోంది. సినిమా అర్థం కాలేదని చెబుతూనే థియేటర్స్ లో ఆడియన్స్ వెళ్తున్నారు.
ఇప్పుడు నేడు క్రిస్మస్ రోజు మూడు సినిమాలు రిలీజైన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ లీడ్ రోల్ పోషించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసిన ఆ సినిమా.. ఇప్పుడు పాజిటివ్ రివ్యూస్ అందుకుంటోంది. దాంతోపాటు రెండు డబ్బింగ్ సినిమాలు మోహన్ లాల్ బరోజ్, కిచ్చా సుదీప్ మ్యాక్స్ కూడా విడుదల అయ్యాయి.
ఈ రెండు సినిమాలపై రిలీజ్ కు ముందు పెద్దగా హైప్ క్రియేట్ అవ్వలేదు. అలా క్రిస్మస్ స్పెషల్ గా వచ్చిన మూడు సినిమాల్లో ప్రస్తుతం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయితే థియేటర్లకు ఆడియన్స్ తరలివస్తారు. మరి ఈసారి క్రిస్మస్ సీజన్ పూర్తిగా వేస్ట్ అవుతుందో లేక ఏమవుతుందో చూడాలి.