సినిమాల కృత్రిమ హైప్ కోసం బ్లాక్ దందా!
ఇటీవల వినోద పరిశ్రమలో ఎక్కువగా చర్చల్లో నిలుస్తున్న అంశం - బ్లాక్ బుకింగ్ లేదా కార్పొరెట్ బుకింగ్.;
ఇటీవల వినోద పరిశ్రమలో ఎక్కువగా చర్చల్లో నిలుస్తున్న అంశం - బ్లాక్ బుకింగ్ లేదా కార్పొరెట్ బుకింగ్. ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన -స్కై ఫోర్స్, విక్కీ కౌశల్ చావా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన- గేమ్ ఛేంజర్ వంటి భారీ చిత్రాల విడుదల సమయంలో ఈ అంశం ఎక్కువగా చర్చకు వచ్చింది.
ఈ సినిమాలకు బ్లాక్ బుకింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కార్పొరెట్ బుకింగుల పేరుతో కొన్ని సీట్లను ఆన్ లైన్ లో కనిపించకుండా లాక్ చేసే ఈ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలు ఈ టికెట్లను బుక్ చేసుకోకపోయినా హీరోలు లేదా నిర్మాతలు (స్టూడియోల అధిపతులు) హైప్ సృష్టించేందుకు తమ డబ్బును ఖర్చు చేసి బ్లాక్ బుకింగ్ చేస్తున్నారని, తద్వారా కృత్రిమ హైప్ ని సృష్టించి ఇది మంచి సినిమా అని నమ్మబలుకుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనివల్ల థియేటర్లలో జెన్యూన్ ఆక్యుపెన్సీ ఎంత అన్నదానిపై గందరగోళం నెలకొంటోంది. ఇది ప్రజల్ని మోసం చేయడమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ విధానం బాలీవుడ్ లో ఎక్కువగా అమల్లో ఉంది. అక్కడ విజయాల శాతం తగ్గడంతో అగ్ర హీరోలే దీనిని ప్రోత్సహిస్తున్నారని ప్రచారం సాగుతోంది.
అక్షయ్ నటించిన `స్కై ఫోర్స్`కి హైప్ పెంచేందుకు బ్లాక్ బుకింగ్ ని అనుసరించారని విమర్శకుడు కోమల్ నహతా విమర్శించడంతో ఈ వివాదం ప్రధానంగా వార్తల్లో హైలైట్ అయింది. బల్క్ బుకింగ్ ద్వారా హైప్ పెంచి ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ లోను మంచి డీల్ కుదుర్చుకుంటున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఎవరు ఎలాంటి అడ్డదారులు తొక్కినా, చివరికి సినిమా కంటెంట్ మాట్లాడుతుంది. ఇటీవల విడుదలైన ఆ మూడు చిత్రాల్లో కంటెంట్ పరంగా ఉత్తమ చిత్రంగా నిలిచిన చావాకు ఒరిజినల్ గా జనాదరణ దక్కింది. కృత్రిమంగా హైప్ క్రియేట్ చేయాల్సిన పని లేకుండా ఈ చిత్రం పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నిజానికి చరణ్, విక్కీ కౌశల్, అక్షయ్ కుమార్ సినిమాల విషయంలోనే కాదు.. చాలా సినిమాలకు ఆన్ లైన్‌లో ఇలాంటి బ్లాక్ బుకింగ్ విధానం నివ్వెరపరుస్తోంది.