దిల్ రాజు వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ మద్దతు
ఈ విషయాన్ని గురించి సీపీఐ నారాయణ స్పందిస్తూ తాను దిల్ రాజు మాటలతో ఏకీభవిస్తున్నాను అన్నారు.
ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన రాజకీయ టర్న్ తీసుకోవడంతో సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద నష్టం వాటిల్లింది. తెలంగాణలో ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంను సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చెప్పడంతో ముందు ముందు నైజాం ఏరియాలో పెద్ద హీరోల సినిమాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటూ చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఆధ్వర్యంలో ఒక టీమ్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితిని చక్క బెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వం నుంచి కాస్త సానుకూల స్పందన వచ్చినట్లుగా అనిపిస్తుంది.
సినిమా ఇండస్ట్రీ వారితో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ తర్వాత బీఆర్‌ఎస్ ముఖ్య నేత కేటీఆర్ మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ పెద్దలను తన వద్దకు రేవంత్ రెడ్డి రప్పించుకున్నాడని, ఇండస్ట్రీని తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ కేటీఆర్ రాజకీయ విమర్శలు చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగి రాజకీయ విమర్శలు చేయడం ద్వారా మరింతగా సినిమా ఇండస్ట్రీకి నష్టం వాటిల్లుతుందని ఆందోళన పలువురు వ్యక్తం చేస్తున్నారు. పలువురు కేటీఆర్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు స్పందించారు.
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్‌గా దిల్ రాజు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేయవద్దు. ప్రభుత్వానికి, సినిమా రంగానికి విభేదాలు వద్దు అంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు. ఈ విషయాన్ని గురించి సీపీఐ నారాయణ స్పందిస్తూ తాను దిల్ రాజు మాటలతో ఏకీభవిస్తున్నాను అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వానికి సినిమా రంగానికి మధ్య విభేదాలు ఉండవద్దని నారాయణ సూచించారు. సినిమా ఇండస్ట్రీ గురించి ఇకనైనా రాజకీయాలు చేయడం అందరూ ఆపాలని ఆయన పేర్కొన్నారు.
పుష్ప 2 సినిమా విడుదలై సంధ్య థియేటర్ వద్ద వివాహిత మృతి చెందినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ నేపథ్యంలో వివాదం మరింత పెద్దదిగా మారుతూ వస్తుంది. మాటకు మాట అన్నట్లుగా పెరుగుతున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ నష్టపోయే పరిస్థితి వచ్చింది అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ విషయాల గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇండస్ట్రీ ప్రముఖులు ఈ విషయాన్ని గురించి అంతా వదిలేయాలని విజ్ఞప్తి చేశారు.