బెయిల్‌పై వ‌చ్చాక న‌టుడు ద‌ర్శ‌న్ బిగ్ ప్లాన్

బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చాక‌, ద‌ర్శ‌న్ త‌న త‌దుప‌రి ప్రాజెక్టులను పూర్తి చేయాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి.

Update: 2025-02-17 06:28 GMT

క‌న్న‌డ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ త‌న అభిమాని హ‌త్య‌కేసులో జైలు శిక్ష‌ను అనుభ‌వించిన సంగ‌తి తెలిసిందే. అభిమాని రేణుకాస్వామి హ‌త్య‌కేసులో అరెస్ట‌యిన ద‌ర్శ‌న్ ఏ2 నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో కోర్టు అత‌డికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చాక‌, ద‌ర్శ‌న్ త‌న త‌దుప‌రి ప్రాజెక్టులను పూర్తి చేయాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలోని ద‌ర్శ‌న్ ప్రాజెక్టులో కొన్ని మార్పులు కనిపించవచ్చని తెలిసింది. ఫిబ్రవరి 16 ఆదివారం నాడు, దర్శన్ పుట్టినరోజున ఈ ప్రాజెక్టుపై పుకార్లకు చెక్ పెడుతూ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తున్నామ‌ని చిత్ర‌ బృందం ప్ర‌క‌టించింది. ధృవ సర్జా మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా `కెడి ది డెవిల్` పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న ప్రేమ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తారు. ప్రేమ్ గ‌తంలో ద‌ర్శ‌న్ తో కరియా (2003) అనే చిత్రాన్ని రూపొందించారు. మ‌ళ్లీ రెండు దశాబ్దాల త‌ర్వాత దర్శన్‌తో అత‌డు తిరిగి కలుస్తున్నాడు. య‌ష్ - టాక్సిక్, దళపతి విజయ్ `జన నాయగన్` వంటి మెగా ప్రాజెక్టులను నిర్మిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని ప్రకటించినా కానీ దర్శన్ వేరే నిర్మాణ సంస్థను ఎంపిక చేస్తార‌ని పుకార్లు వచ్చాయి. అయితే ప్రేమ్- కెవిఎన్ ప్రొడక్షన్స్ కి చెందిన బృందాలు ద‌ర్శ‌న్ మూవీ గురించి ఒక చిన్న వీడియోని విడుదల చేయడం ద్వారా అన్ని ఊహాగానాలకు తెరదించాయి. ఈ టీజర్‌లో దర్శన్ స్వరం వినిపించింది. ఇది పెద్ద స్థాయిలో రూపొంద‌నున్న‌ పౌరాణిక జాన‌ప‌ద చిత్ర‌మ‌ని హింట్ అందింది. ఒక గ‌ద్ద‌, హిందువులకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన పురాతన నగరం ఫోటోలు ప్రేక్షకుల్లో ఉత్సుకతను మరింత రేకెత్తించాయి.

అలాగే తరుణ్ సుధీర్ తోను ద‌ర్శ‌న్ త‌న 59వ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. కాటేరా విజయం తర్వాత దర్శన్ -తరుణ్ సుధీర్ ఇద్దరూ తమ తదుపరి సినిమా కోసం వేచి చూస్తున్నారు. దీనికి తాత్కాలికంగా డి59 అనే వ‌ర్కింగ్ టైటిల్ ని నిర్ణ‌యించారు. ది మీడియా హౌస్ స్టూడియో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డి-59 ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుద‌లైంది. హ‌త్య కేసులో చిక్కుకున్న ద‌ర్శ‌న్ కోర్టు విచార‌ణ‌ల‌కు హాజ‌ర‌వుతూనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది.

Tags:    

Similar News