దర్శన్ అభిమాని హత్యకు డీల్ రేంజ్ ఇదీ
దర్శన్, పవిత్రలను రిమాండ్ కి తరలించి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ప్రముఖ కన్నడ అగ్ర హీరో దర్శన్ తన అభిమానిని హత్య చేయించారని వచ్చిన ఆరోపణలపై పోలీసుల విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ఏ1 గా దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను, ఏ2గా దర్శన్ ని నిర్ధేశించారు. అయితే ఈ హత్యతో తన తండ్రికి ఎలాంటి సంబంధం ఉండబోదని దర్శన్ మొదటి భార్య కుమారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శన్ పై తాను ఒత్తిడి చేయకపోయి ఉంటే, ఈ హత్య జరిగేది కాదని పవిత్ర ఆవేదన వెలిబుచ్చినట్టు విచారణ అధికారులు వెల్లడించినట్టు మీడియాలో కథనాలొస్తున్నాయి.
ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. దర్శన్, పవిత్రలను రిమాండ్ కి తరలించి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అభిమాని హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్ మరో ముగ్గురు వ్యక్తులకు డబ్బు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. ముగ్గురిలో ఒక్కొక్కరికి దర్శన్ 5లక్షల చొప్పున ఆఫర్ చేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే వేరొక సోర్స్ వివరాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మొత్తం 30 లక్షల డీల్ లో కొంత మొత్తాన్ని అడ్వాన్స్ ఇచ్చారని కూడా ప్రముఖ మీడియాల్లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే.
ఈ హత్య కేసులో కాలువలో లభించిన మృతదేహాన్ని కుక్కలు ఒడ్డుకు లాక్కుని రావడంతో పోలీసులకు సమాచారం అందింది. ఫుడ్ డెలివరీ ఉద్యోగి పోలీసులకు ఫోన్ చేయగా, అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ మృత దేహం రేణుకాస్వామిదేనని గుర్తించారు.
రేణుకాస్వామి పలుమార్లు దర్శన్ ప్రియురాలిగా చెబుతున్న పవిత్రకు అసభ్యకర మెసేజ్ లను పంపాడు. దీనికి ప్రతీకారంగా దర్శన్ ని పురికొల్పి పవిత్ర హత్య చేయించిందని పోలీసులు చెబుతున్నారు. అందువల్లనే పవిత్రను ఏ1గా నిర్ధేశించారు. దర్శన్- పవిత్ర మధ్య అనుబంధం గురించి చాలా కాలంగా కన్నడ మీడియాల్లో పుకార్లు ఉన్నాయి. ఆ ఇద్దరి అనుబంధంపై దర్శన్ మొదటి భార్య పలుమార్లు ఫిర్యాదులు చేసారు. మొదటి భార్యతో దర్శన్ కి సమస్యలున్నాయి. అభిమాని రేణుకా స్వామిని ఒక షెడ్డులో కట్టేసిన దుండగులు దర్శన్ సమక్షంలో దుంగలతో మోదారు. దర్శన్ నేరుగా అతడిని పిడిగుద్దులు గుద్దాడు. మర్మాంగంపై తన్నడం వల్లనే అతడు మరణించాడని నిందితులు వెల్లడించినట్టు మాతృభూమి డాట్ కాం తన కథనంలో వెల్లడించింది.