దాసరి జయంతి …ప్రభాస్ ఏమి చేశాడు అంటే!
దర్శకరత్న డా.దాసరి నారాయణరావు తర్వాత టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవరనేది ప్రశ్నగానే మిగిలింది.
దర్శకరత్న డా.దాసరి నారాయణరావు తర్వాత టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవరనేది ప్రశ్నగానే మిగిలింది. మెగాస్టార్ చిరంజీవి కొంతవరకూ దీనిని ఫుల్ ఫిల్ చేయాలని ప్రయత్నించినా కానీ కొందరికి ఇది నచ్చలేదన్నది బహిరంగ రహస్యం. ఆపదలో ఉన్నవారికి విరివిగా విరాళాలు ఇచ్చినా లేదా ఔత్సాహిక ఫిలింమేకర్స్ ని ప్రోత్సహించినా.. కరోనాలో నిత్యావసరాలు, వైద్య సేవలతో ఆదుకున్నా చిరుని పరిశ్రమ పెద్దగా అంగీకరించేందుకు ఒక సెక్షన్ వ్యతిరేకంగానే ఉంది. అనవసర పెద్దరికం తనకు అవసరం లేదని కష్టంలో ఉన్నవారిని ఆదుకునేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని చిరంజీవి ఆ మాటకు కట్టుబడి ఉన్నారు.
అయితే ఇలాంటివి లేకుండా ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన సినీపెద్ద ఎవరైనా ఉన్నారు అంటే దశాబ్ధాల చరిత్రలో అది దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మాత్రమే. మే 4 ఆయన జయంతి సందర్భంగా ఈసారి దర్శకసంఘం గట్టి ప్రణాళికతో ముందుకు వచ్చింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీగా జరిగే జయంతి ఉత్సవాల్లో దాసరి పేరుతో నిధిని సేకరించి ప్రతిభావంతులైన ఔత్సాహిక దర్శకులను కష్టాల్లో ఆదుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. జయంతి రోజున నిర్వహించే భారీ వేడుకకు ఇండస్ట్రీ దిగ్గజ దర్శకులు సహా ప్రముఖులంతా హాజరుకానున్నారు. కె.రాఘవేంద్రరావు, పూరి జగన్నాథ్, రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ వంటి ప్రముఖ దర్శకులంతా ఈ వేడుకను పరిపుష్టం చేయనున్నారు. అలాగే ఇదే వేదికపై భారీగా విరాళాల సేకరణ ఉంటుంది.
ప్రతిభావంతులైన దర్శకులంతా స్థిరపడినవారు కాదు. ఇంకా ఉపాధిపరంగా ఆపసోపాలు పడేవాళ్లు చాలామంది. అలాగే ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన దర్శకులను గుర్తించాల్సిన బాధ్యత కూడా దర్శకసంఘానికే ఉంది. అలాంటివారిని గుర్తించి సరైన కష్టకాలంలో ఆదుకుంటే వారంతా పెద్ద స్థాయికి ఎదిగేందుకు ఛాన్సుంది. అందువల్ల నిధి సేకరణ అనేది చాలా అత్యావశ్యకమైనది. ఈసారి రొటీన్ గా కాకుండా డైరెక్టర్స్ డేని స్పెషల్ గా ప్లాన్ చేయడం వెనక ఇలాంటి సముచితమైన ఆలోచన ఉందని కూడా తెలుస్తోంది. ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ దర్శకసంఘం కోసం 35లక్షల విరాళం ప్రకటించారు. అతడి స్ఫూర్తితో ఇతర స్టార్లు కూడా భారీగా విరాళాలు ప్రకటించే వీలుందని అంచనా. దిగ్గజ దర్శకులను సన్మానించడం చరిత్రను పునఃస్మరణం చేయడం అవసరం. అలాగే నవతరం ఔత్సాహిక దర్శకులకు ప్రోత్సాహకాలు అందించడం కూడా చాలా ముఖ్యం. దర్శకసంఘంలో సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేసేందుకు నిధి సేకరణ సహకారిగా ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. ఈసారి దర్శకరత్న దాసరి బర్త్ డే నిజంగా స్పెషల్ అని చెప్పడానికి ఇది చాలు.