ఇయర్ ఎండింగ్ లో 'పుష్ప' వినోదం.. వారం గ్యాప్ లో 12 సినిమాలు!
2024 చివరకు వచ్చేశాం. గడిచిన 11 నెలల్లో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే, మరికొన్ని డిజాస్టర్లుగా మారాయి.
2024 చివరకు వచ్చేశాం. గడిచిన 11 నెలల్లో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే, మరికొన్ని డిజాస్టర్లుగా మారాయి. నవంబర్ నెల టాలీవుడ్ కు పెద్దగా కలిసిరాదనే సెంటిమెంట్ మరోసారి ప్రూవ్ అయింది. అక్టోబరు నెలాఖరున వచ్చిన సినిమాలే నవంబరులోనూ సందడి చేశాయి కానీ, ఈ నెలలో రిలీజైన ఇతర చిత్రాలేవే మినిమం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదు. ఈ నేపథ్యంలో డిసెంబరు పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఎప్పటిలాగే ఈ నెలలో అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇయర్ ఎండింగ్ లో వినోదం పంచేందుకు వస్తున్న ఈ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2: ది రూల్' సినిమా డిసెంబర్ 5వ తారీఖున థియేటర్లలో విడుదల కానుంది. ఇది మూడేళ్ళ క్రితం ఇదే నెలలో వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమాకి సీక్వెల్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1200+ స్క్రీన్ లలో 6 భాషల్లో బన్నీ సినిమా రిలీజ్ కానుంది. ఆ తర్వాత రెండు వారాల పాటు పుష్పరాజ్ కు పోటీగా మరో చిత్రాన్ని విడుదల చేసే సాహసం ఎవరూ చెయ్యడం లేదు.
వేదిక ప్రధాన పాత్రలో నటించిన 'ఫియర్' అనే సినిమా డిసెంబరు 14న అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తోంది. ఆ తర్వాత క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని డజనుకు పైగానే సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. డిసెంబర్ 20 మొదలుకొని 28వ తేదీ వరకూ పలు క్రేజీ చిత్రాలు, డబ్బింగ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిల్లో అల్లరి నరేశ్ నటించిన 'బచ్చలమల్లి' సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబరు 20న ఆడియన్స్ ముందుకు వస్తుంది.
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ హీరోగా నటిస్తున్న 'సారంగపాణి జాతకం' సినిమాని కూడా అదే రోజున రిలీజ్ చేస్తున్నారు. కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'యూఐ'(UI) మూవీ డిసెంబర్ 20నే థియేటర్లలోకి రానుంది. 'విడుదల' సీక్వెల్ గా సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న 'విడుదల 2' చిత్రం కూడా అదే తేదీన విడుదల కాబోతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ తో 'ముఫాసా: ది లయన్ కింగ్' అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ తెలుగులోకి రాబోతోంది. ఇది 'ది లయన్ కింగ్' చిత్రానికి ప్రీక్వెల్. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్ర పోషించిన 'ఎర్రచీర: ది బిగినింగ్' చిత్రం సైతం డిసెంబర్ 20వ తేదీనే విడుదల కానుంది. తర్వాతి రోజు 'మ్యాజిక్' అనే మ్యూజికల్ మూవీతో మ్యాజిక్ చేయడానికి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి వస్తున్నారు.
'భీష్మ' తర్వాత నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతున్న 'రాబిన్‌హుడ్' చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అదే రోజున చంటబ్బాయ్ తాలూకా అంటూ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' సినిమాతో వస్తున్నారు కమెడియన్ వెన్నెల కిశోర్. మహానటి కీర్తి సురేశ్ బాలీవుడ్ డెబ్యూ మూవీ 'బేబీ జాన్' క్రిస్మస్ కే ఆడియన్స్ ను పలకరించబోతోంది. 'తేరి' హిందీ రీమేక్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు.
'పతంగ్' అనే చిన్న సినిమా డిసెంబర్ 27న థియేటర్లలో ఎగరడానికి వస్తుంటే, మరుసటి రోజు 28న 'మిస్టర్ మాణిక్యం' అంటూ సముద్రఖని తమిళ డబ్బింగ్ మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. ఇలా డిసెంబర్ నెలలో సందడి చేయడానికి అనేక సినిమాలు వస్తున్నాయి. వాటిల్లో 'పుష్ప 2' చిత్రం టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందనడంలో సందేహం లేదు. 'రాబిన్‌హుడ్', 'బచ్చలమల్లి' లాంటి సినిమాలు కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. మరి ఓవరాల్ గా పైన చెప్పుకున్న చిత్రాలలో ఏవేవి ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.