2025 లో దీపికా పదుకొణే జర్నీ ఇలా ఉంటుందా!
దీపికా పదుకొణే కెరీర్ లో గత ఏడాది ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. అమ్మడు పండంటి బిడ్డకు జన్మ నిచ్చింది 2024 లోనే.
దీపికా పదుకొణే కెరీర్ లో గత ఏడాది ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. అమ్మడు పండంటి బిడ్డకు జన్మ నిచ్చింది 2024 లోనే. కెరీర్ పరంగానూ ఓ రెండు భారీ విజయాలు దీపిక ఖాతాలో నమోదయ్యాయి. `ఫైటర్`, `కల్కి 2898` లాంటి విజయాలు అందుకుంది. `సింగం ఎగైన్` లోనూ పోలీస్ గానూ ప్రేక్షకుల్ని అలరించింది. ఇలా 2024దీపికాకు ఓ స్పెషల్ గా నిలిచిపోతుంది.
మరి కొత్త ఏడాదిలో కెరీర్ ఎలా ఆరంభించబోతుంది అంటే ఎలాగూ `కల్కి 2898` రెండవ భాగం షూటింగ్ లో పాల్గొంటుంది. తొలుత ఈ ప్రాజెక్ట్ నే దీపిక పూర్తి చేస్తుంది. మొదటి భాగంలో దీపిక పాత్ర బలం ఏంటన్నది అర్దమైంది. రెండవ భాగంలో ఆ పాత్ర మరింత బలంగా పండుతుందని అంచనాలున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ గాక కొత్త సినిమాలేవి పట్టాలెక్కించదా? అంటే దీపిక నుంచి ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు.
దీపిక ప్రసవం అయిన నాటి నుంచి ఇంటికే పరిమితమైంది. ఎలాంటి ఈవెంట్లకు హాజరు కావడం లేదు. కొత్త ప్రాజెక్ట్ లకు కమిట్ అవ్వడం లేదు. బిడ్డ ఆలనా, పాలనా చూసుకుంటుంది. కుమార్తెకు సంబంధించిన ప్రతీ అనుభూతిని తల్లిగా తాను అందించాలని సమయంతా పాపాయికే కేటాయిస్తుంది. అయితే మరో మూడు నెలలు పాటు దీపిక ఇదే పనిలో ఉంటుంది. ఆ తర్వాతే మళ్లీ కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో జోరు పెంచే అవకాశం ఉంది.
దీపిక గర్భం దాల్చిన దగ్గర నుంచి కొత్త ప్రాజెక్ట్ లేవి అంగీకరించలేదు. అప్పటికే కమిట్ అయిన చిత్రాలనే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో 2025 ద్వితియార్ధం నుంచి దీపిక కొత్త సినిమాలతో జోరు పెంచే అవకాశం ఉంది. ప్రసవం తర్వాత రూపంలో మార్పులు సహజం. ప్రస్తుతం దీపిక మునుపటి బ్యూటీని తీసుకొచ్చే పనిలోనూ పడ్డట్లు సమాచారం. సోషల్ మీడియాకి కూడా అందుకే దూరంగా ఉంటుందని ప్రచారంలో ఉంది.