90గం.ల డ్యూటీ.. షాక‌య్యాన‌న్న‌ స్టార్ హీరోయిన్

కొద్దిరోజులుగా 90గంట‌ల ప‌ని విధానం గురించి సోష‌ల్ మీడియాల్లో పెద్ద డిబేట్ కొన‌సాగుతోంది.

Update: 2025-01-10 03:59 GMT

కొద్దిరోజులుగా 90గంట‌ల ప‌ని విధానం గురించి సోష‌ల్ మీడియాల్లో పెద్ద డిబేట్ కొన‌సాగుతోంది. దేశంలోని యువ‌త ఎక్కువ స‌మ‌యాన్ని ప‌ని కోసం కేటాయించాల‌ని, దానివ‌ల్ల సంప‌ద‌ల‌ను సృష్టించాల‌ని, దేశ అభివృద్ధిలో ఇది భాగం అని ఇన్ఫోసిస్ నారాయ‌ణ వ్యాఖ్యానించారు. అయితే దీనిని ప‌లువురు సెల‌బ్రిటీలు ఖండించారు. స‌హ‌జంగానే సోష‌ల్ మీడియా డిబేట్ల‌లో భిన్న స్వ‌రాలు వినిపించాయి. కొంద‌రు నారాయ‌ణ సూచ‌న‌ను స‌మ‌ర్థించ‌గా, మ‌రికొంద‌రు వ్య‌తిరేకించారు.


ఇటీవ‌ల దీనిపై ప్ర‌పంచ కుభేరుడు గౌత‌మ్ అదానీ కూడా స్పందించారు. ప‌ని గంట‌ల డిబేట్ లో భాగంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్పందిస్తూ.. ఒకరు తమకు నచ్చిన పనులను చేసినప్పుడు సమతుల్యత సాధ్య‌మ‌ని, అలా కాకుండా గంట‌ల త‌ర‌బ‌డి ఆఫీసుల్లోనే ఉండిపోతే `పెళ్లాం పారిపోతుంద‌`ని అదానీ వ్యాఖ్యానించారు. ఆయ‌న వ్యాఖ్య‌లు వేగంగా యువ‌త‌రంలోకి దూసుకెళ్లాయి. ప్ర‌తి ఒక్క‌రూ చివ‌రికి ఈ భూమి నుంచి వెళ్లిపోవాల్సిందేన‌ని తెలిసాక‌ జీవితం సరళంగా మారుతుందని కూడా అదానీ వేదాంతం వ‌ల్లించారు.


ఇప్పుడు ఇదే చ‌ర్చ‌లో భాగంగా ఎల్ అండ్ టీ ఛైర్మ‌న్ ఎస్‌.ఎన్ సుబ్రహ్మణ్యం 90 గంటల పని వారాన్ని ప్రతిపాదించారు. ఈ వీడియో రెడిట్‌లో వేగంగా వైర‌ల్ అయింది. ఇన్ఫోసిస్ నారాయ‌ణ వ్యాఖ్య‌ల‌తో పాటు సుబ్ర‌మ‌ణ్యం వ్యాఖ్య‌లు కూడా డిబేట్‌లోకి వ‌చ్చాయి. ఒక ఉద్యోగితో సుబ్ర‌మ‌ణియ‌న్ సంభాష‌ణ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అస‌లు య‌జ‌మానులు శనివారం కూడా ప‌నిని ఎందుకు కోరుకుంటారు? అని ఉద్యోగి నిరాశ‌ను వ్య‌క్తం చేయ‌గా, క్ష‌మించాలి.. నేను మిమ్మల్ని ఆదివారాల్లో పని చేయించలేకపోతున్నాను. నేను కూడా అలాగే చేస్తాను కాబట్టి ఆదివారాల్లో మిమ్మల్ని పని చేయించగలిగితే నేను మరింత సంతోషంగా ఉంటాను. ఇంట్లో కూర్చొని మీరు ఏం చేస్తారు? మీరు మీ భార్యను ఎంతసేపు తథేకంగా చూడగలరు? భార్యలు తమ భర్తలను ఎంతసేపు తదేకంగా చూడగలరు? ఆఫీసుకు వెళ్లి పని ప్రారంభించండి`` అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌నులు త‌మ‌దైన శైలిలో స్పందించారు. చాలామంది దీనిని వ్య‌తిరేకించారు. ఆదివారాలు కూడా కార్పొరెట్ మింగేస్తుందా? అని కొంద‌రు ప్ర‌శ్నించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు. ఇన్ స్టాలో దీపిక‌ ఇలా రాసింది. ''ఇటువంటి సీనియర్ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం చూసి షాకయ్యాను'' అని రాసారు. మానసిక ఆరోగ్యం ప్రాధాన్యత గురించి కూడా ప్ర‌శ్నిస్తూ.. దీపిక హ్యాష్ ట్యాగ్ జోడించారు. దీపిక లాంటి అగ్ర క‌థానాయిక‌తో పాటు ప‌లువురు స్టార్లు ఎల్అండ్ టి ఛైర్మ‌న్ వ్యాఖ్య‌ల్ని ఖండించ‌డం ఇప్పుడు సోష‌ల్ మీడియాల్లో ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

ఆర్‌.పి.జి గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా 90 గంటల పని వారపు ఆలోచన గురించి తన ఆందోళనలను వ్యక్తం చేశారు, L&T చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఎక్కువ పని గంటలను స‌మ‌ర్థిస్తూ... ఆదివారాలు ప‌ని చేయాల‌న‌డాన్ని ఆయ‌న తీవ్రంగా వ్య‌తిరేకించారు. ``వారానికి 90 గంటలు? ఆదివారం పేరును `సన్-డ్యూటీ`గా ఎందుకు మార్చకూడదు? `డే ఆఫ్`ను ఒక పాత‌బ‌డిన‌ భావనగా ఎందుకు మార్చకూడదు! కష్టపడి కాదు తెలివిగా పనిచేయడం నేను నమ్మేది.. కానీ జీవితాన్ని శాశ్వత ఆఫీస్ షిఫ్ట్‌గా మార్చడం? అది బర్నౌట్‌కు ఒక రెసిపీ.. ఇది విజయం కాదు. వ‌ర్క్ - లైఫ్‌ సమతుల్యత చాలా అవ‌స‌రం. ఇది నా అభిప్రాయం`` అని గోయెంకా Xలో రాసారు.

Tags:    

Similar News