'దేవర' ఫస్ట్ షో.. చివరి నిమిషంలో ఇదెక్కడి షాక్

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవర-1 సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.

Update: 2024-09-26 13:31 GMT

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవర-1 సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో 1 AM షోలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో, ఆ షో కోసం ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

అర్ధరాత్రి షోలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ముందు రోజు సాయంత్రం నుంచి థియేటర్స్ వద్ద పడిగాపులు కాయడం సర్వసాధారణం. ఇక నందమూరి ఫ్యాన్స్ కూడా దేవర ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు మాస్ థియేటర్స్ వద్ద ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిడ్ నైట్ ఒంటిగంట షోలు కేవలం కొన్ని స్క్రీన్స్ కు మాత్రమే పరిమితం చేశారు.

అయితే ఒక ఐకానిక్ థియేటర్ వద్ద అంతా సిద్ధమైంది అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో షాక్ ఇచ్చారు. హైదరాబాదు కూకట్‌పల్లిలోని మల్లికార్జున-బ్రహ్మరాంబ థియేటర్‌లో ప్రీమియర్ షో రద్దయ్యినట్లు తెలుస్తోంది. థియేటర్ బయట షో లేదు అని బోర్డులు అయితే దర్శనమిచ్చాయి. ఈ షో రద్దుకు గల కారణంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, లోపలి సమాచారం ప్రకారం, థియేటర్ యాజమాన్యం మరియు డిస్ట్రిబ్యూటర్ మధ్య లాభాల పంపకంలో తలెత్తిన విభేదాల కారణంగా ఈ షో రద్దు చేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ క్రేజ్‌ని ఉపయోగించుకుని, థియేటర్ యాజమాన్యం అధిక లాభం పొందాలని ప్రయత్నించినట్లు టాక్ వస్తోంది. అయితే వారి డీల్స్ కారణంగా అభిమానుల్ని నిరాశపరచడం మంచి నిర్ణయం కాదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కూకట్‌పల్లిలోని మల్లికార్జున-బ్రహ్మరాంబ థియేటర్, నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం కలిగి ఉంది.

గతంలో ఎన్నో నందమూరి హీరోల సినిమాలు ఈ థియేటర్‌లో విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. ఈ నేపథ్యంలో దేవర 1 AM షో రద్దవడంతో, అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇతర థియేటర్లలో ఇంకా చాలామంది ఈ ప్రత్యేక షోలను ఎంచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా నందమూరి హీరోలకు మంచి డిమాండ్ ఉన్న ఈ ఐకానిక్ థియేటర్ వద్ద దేవర షో క్యాన్సిల్ అవ్వడం అనేది ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. మరి ఈ విషయంలో నిర్మాత కలుగజేసుకొని సమస్యను పరిష్కరిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News