ప్రభాస్ వల్ల కాలేదు.. తారక్ వల్ల అవుతుందా?
గత దశాబ్ద కాలంలో మన హీరోలు ఒక్కొక్కరుగా మార్కెట్ పరంగా తెలుగు రాష్ట్రాల బౌండరీలు దాటేశారు.
గత దశాబ్ద కాలంలో మన హీరోలు ఒక్కొక్కరుగా మార్కెట్ పరంగా తెలుగు రాష్ట్రాల బౌండరీలు దాటేశారు. మన స్టార్ల సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బాగా ఆడుతున్నాయి. కొందరు స్టార్లు విదేశాల్లో కూడా బాగా ఫాలోయింగ్ పెంచుకున్నారు. యుఎస్‌లో తెలుగు హీరోలకు ఎప్పట్నుంచో మార్కెట్ ఉంది. ఐతే కొన్ని సినిమాలు ఎవ్వరూ ఊహించని కొత్త మార్కెట్లలోకి కూడా చొచ్చుకెళ్లాయి. అలా తెలుగు సినిమాలకు మార్కెట్ ఓపెన్ అయిన దేశాల్లో జపాన్ ఒకటి. ఇక్కడ ‘బాహుబలి’ సినిమా అదరగొట్టింది. దీని తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ ఇంకా పెద్ద విజయం సాధించింది. అక్కడ ఇండియన్ సినిమాలకు సంబంధించి అన్ని రికార్డులనూ అది బద్దలు కొట్టేసింది. ఇవి రెండూ రాజమౌళి సినిమాలే అన్న సంగతి తెలిసిందే. ఐతే ‘బాహుబలి’ హీరో ప్రభాస్ నుంచి వచ్చిన చివరి సినిమా ‘కల్కి’ని జపనీస్‌లో అనువదించి బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. కానీ అది అక్కడ ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. రిలీజ్ తర్వాత దాని గురించి పెద్దగా డిస్కషనే లేదు.
ఐతే ఇప్పుడు జపాన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. తన చివరి సినిమా ‘దేవర’ జపనీస్‌లో మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో టీం ప్రమోషన్లు మొదలుపెట్టింది. తాజాగా తారక్ జపాన్ అభిమానులతో ఆన్ లైన్లో వీడియో చిట్ చాట్ చేశాడు. త్వరలోనే తారక్ జపాన్‌కు వెళ్లి సినిమాను ప్రమోట్ చేయనున్నాడట. తారక్ ‘ఆర్ఆర్ఆర్’ చేయడానికి ముందే జపాన్‌లో కొంత గుర్తింపు సంపాదించాడు. అక్కడ్నుంచి తన కోసం ఫ్యాన్స్ ఇండియాకు వస్తుంటారు కూడా. ఐతే ‘కల్కి’ లాంటి విజువల్ వండర్‌నే జపాన్ ప్రేక్షకులు పట్టించుకోని నేపథ్యంలో ‘దేవర’ లాంటి మామూలు సినిమా అక్కడ ఆశించిన ఫలితాన్నందుకుంటుందా అన్నది సందేహం. తారక్ అక్కడ మార్కెట్ పెంచుకోవాలనుకుంటే.. ఇంకేదైనా పెద్ద ఈవెంట్ మూవీతో వెళ్లాలి. ‘దేవర’ తెలుగు ప్రేక్షకుల నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. విదేశాల్లో సత్తా చాటేంత కంటెంట్ ఉన్న సినిమా అయితే కాదది. మరి ‘బాహుబలి’తో వచ్చిన ఫాలోయింగ్‌తో ప్రభాస్ ‘కల్కి’ని జపాన్ ప్రేక్షకులకు చేరువ చేయలేకపోయిన నేపథ్యంలో.. ‘ఆర్ఆర్ఆర్’తో వచ్చిన ఫేమ్‌ను ఉపయోగించుకుని ‘దేవర’ను తారక్ ఎంతమేర జపాన్‌లో సేల్ చేయగలడో చూడాలి.