'దేవర'.. ఈ లెక్కన చూస్తే పార్ట్-2 ఇప్పట్లో కష్టమేనా?
ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని మేకర్స్ అఫిషియల్ గా పోస్టర్లు వేశారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ''దేవర''. సెప్టెంబర్ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని మేకర్స్ అఫిషియల్ గా పోస్టర్లు వేశారు. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'దేవర' పార్ట్-2 ఉంటుందా లేదా? అనే చర్చలు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ ప్రస్తుతం యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ లో 'వార్ 2' సినిమాలో నటిస్తున్నారు. ఇది ఆయనకు హిందీ డెబ్యూ. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఉన్నారు. వచ్చే నెలలో సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని భావిస్తున్నారు. ఇక జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ ఓ మూవీ కమిటైనట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఆల్మోస్ట్ సినిమా ఫిక్స్ అయినట్లే అని అంటున్నారు. ఇవి కాకుండా తారక్ బాలీవుడ్ లో మరో మూవీకి సైన్ చేసినట్లుగా టాక్ ఉంది.
ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే మరో మూడు నాలుగేళ్ల వరకూ ఫ్రీగా ఉండేలా కనిపించడం లేదు. 'వార్ 2' సినిమా సెట్స్ మీద ఉండగానే, NTRNeel మూవీని పట్టాలెక్కించాలని చూస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ కంప్లీట్ అవ్వడానికి ఏడాదికి పైగానే టైమ్ పట్టొచ్చు. ఈ గ్యాప్ లో నెల్సన్ 'జైలర్ 2' సినిమా పూర్తి చేసుకొని వస్తాడు. ఆ తర్వాత తారక్ తో సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది. అయితే వీటి మధ్యలో కొరటాల శివతో 'దేవర 2' మూవీ ఉంటుందా లేదా? అనేదే ప్రశ్నార్థకంగా మారింది.
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసిన 'దేవర 1'.. కొన్ని రోజుల పాటు టాప్ ట్రెండింగ్ చార్ట్ లో కొనసాగింది. అయితే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రానికి, ఓటీటీలో విపరీతమైన నెగెటివిటీ కనిపించింది. ఎన్టీఆర్ వరకూ న్యాయం చేసినప్పటికీ, కొరటాల శివ రైటింగ్ బాగాలేదని, సినిమాటోగ్రఫీ సరిగా లేదనే విమర్శలు వచ్చాయి. సీన్ టూ సీన్ ను సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేశారు.
ఎన్టీఆర్ స్టార్‌డమ్, అనిరుధ్ మ్యూజిక్ మాత్రమే 'దేవర 1' సినిమాను కాపాడాయనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మిక్స్డ్ టాక్ వచ్చినా, రివ్యూలు ఏమంత గొప్పగా లేకపోయినా.. సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ గట్టిగా నిలబడి ఈ చిత్రాన్ని విజయ తీరాలకు చేర్చారనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో కొరటాల రైటింగ్ ఆకట్టుకోలేదు అనే కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో, ఎన్టీఆర్ లైనప్ ను పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇప్పట్లో 'దేవర 2' సినిమా వుండే అవకాశం లేదనే మాట వినిపిస్తోంది.
ఇటీవల కాలంలో అనేక సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించినప్పటికీ, మొదటి భాగం నిరాశ పరచడంతో రెండో భాగం దిశగా అడుగులు పడని ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. రామ్ పొతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన 'స్కంద' సినిమాకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. అలానే రవితేజ నటించిన 'ఈగల్' మూవీకి, శ్రీకాంత్ అడ్డాల తీసిన 'పెదకాపు 1' చిత్రాలకు కొనసాగింపుగా సినిమాలు చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కానీ ఈ సినిమాలన్నీ డిజాస్టర్స్ అవ్వడంతో సీక్వెల్స్ ఉండకపోవచ్చని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఇక్కడ 'దేవర 1' హిట్టయినా, 'దేవర 2' మూవీ ఉంటుందో లేదో అనే చర్చలు జరుగుతుండటం గమనార్హం.