ఆ సంస్థ చేతికి ఎన్టీఆర్, బాలయ్య సినిమాలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర', నందమూరి బాలకృష్ణ NBK109 సినిమాల ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఇండియాలో నంబర్ వన్ ఓటీటీగా పేరుగాంచిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు టాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. గత కొద్ది కాలంగా స్టార్ హీరోల సినిమాల ఓటీటీ రైట్స్ విషయంలో ఎంతటి పోటీ ఉన్నా నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు ఆ రైట్స్ ని కొనుగోలు చేస్తూ వస్తోంది. అలా ఇప్పటికే సలార్, గుంటూరు కారం లాంటి పెద్ద సినిమాల ఓటీటీ రైట్స్ ని కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో ఇద్దరు నందమూరి హీరోల రాబోయే సినిమాల ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర', నందమూరి బాలకృష్ణ NBK109 సినిమాల ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది." ఎన్టీఆర్ - కొరటాల శివల దేవర, నందమూరి బాలకృష్ణ ఆన్ గోయింగ్ ఫిల్మ్ 'NBK109' సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు" ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
ఎన్టీఆర్ దేవర పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంటే, 'NBK109' తెలుగు రీజినల్ ఫిల్మ్ గా రూపొందుతోంది. ఈ రెండు సినిమాల ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నట్లు సమాచారం. వీటితోపాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ ఓటీటీ రైట్స్ ని కలిగి ఉన్నామని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. అలాగే సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' ఓటీటీ రైట్స్ ని ఇప్పటికే కొనుగోలు చేసినట్లు పేర్కొంది.
దీన్ని బట్టి నెట్ ఫ్లిక్స్ తెలుగు మార్కెట్ పై దృష్టి సారించడంలో మిగతా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కంటే కాస్త ముందుగానే ఉందనే విషయం స్పష్టమవుతుంది. ఇక ఎన్టీఆర్ దేవర విషయానికొస్తే.. హై వోల్టేజ్ యాక్షన్ రేవెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతోంది. అందులో మొదటి భాగాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నారు.
ఇక బాలయ్య 'NBK109' ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.