చావా ఎఫెక్ట్.. వీకీలో శంభాజీ మ‌హారాజ్ క‌థ‌ త‌ప్పుల‌పై CM సీరియ‌స్

ఛత్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ వార‌సుడు శంభాజీ మ‌హారాజ్ జీవిత క‌థ‌తో తెర‌కెక్కిన వారియ‌ర్ డ్రామా `చావా` బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2025-02-19 10:03 GMT

ఛత్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ వార‌సుడు శంభాజీ మ‌హారాజ్ జీవిత క‌థ‌తో తెర‌కెక్కిన వారియ‌ర్ డ్రామా `చావా` బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా 150 కోట్ల క్ల‌బ్ నుంచి 200 కోట్ల క్ల‌బ్ వైపు ప్ర‌యాణిస్తోంది. కేవ‌లం ఐదు రోజుల్లో అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధించి బాలీవుడ్ కి మ‌రో మ‌ర‌పురాని విజాయాన్ని చావా అందించింది.

ఇక ఈ సినిమా వీక్షిస్తున్న మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు ఎంతో ఎమోష‌న్ కి గుర‌వ్వ‌డం మీడియాల్లో ద‌ర్శ‌న‌మిస్తోంది. ఒక తాగుబోతు ఏకంగా థియేట‌ర్ లో శంభాజీని హింసిస్తున్న ఔరంగ‌జేబ్ నే చంపాల‌నుకుని, తెర‌ను చించేసాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేసారు. అయితే పాపుల‌ర్ ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా వికీపీడియాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి `అభ్యంతరకరమైన` కంటెంట్ పై మహారాష్ట్రలో వివాదం చెలరేగింది. దీనికి ప్రతిస్పందనగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం రాష్ట్ర పోలీసులను, వికీపీడియాను సంప్రదించి కంటెంట్‌ను తొలగించమని అభ్యర్థించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల‌తో మహారాష్ట్ర సైబర్ పోలీసులు వికీపీడియాకు నోటీసు జారీ చేశారు. స‌ద‌రు కంటెంట్‌ను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వికీపీడియా వంటి ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు సమాచారం ఆమోదయోగ్యం కాదని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించడాన్ని ప్రభుత్వం సహించదని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. శంభాజీ మ‌హారాజ్ పై అభ్యంత‌ర‌క‌ర కంటెంట్ ని తొల‌గించాల‌ని తాను వీకీపిడియా అధికారుల‌ను కోరిన‌ట్టు తెలియ‌జేసారు. చ‌రిత్ర‌కారుల క‌థ‌ల్ని వ‌క్రీక‌రించ‌కూడ‌ద‌ని ఆయ‌న అన్నారు.

ఆన్ లైన్ లో వీకీపిడియా స‌మాచారం ఏదైనా ఓపెన్ గా ఎడిట్ చేసుకునే ఆప్ష‌న్ ఉంటుంది. ఇలా ఎడిట్ చేసిన‌ప్పుడు ఈ త‌ప్పుడు స‌మాచారం రాసార‌నే విష‌యాన్ని గుర్తించాల్సి ఉంటుంది. వీకీలో స‌మాచారాన్ని ఎవ‌రికి వారు స్వ‌చ్ఛందంగా అప్ డేట్ చేసుకుంటున్నారు. వాస్తవాలను వక్రీక‌రించ‌కుండా నిరోధించడానికి నిబంధనలను అమలు చేయమని మేము వారిని అభ్యర్థిస్తున్నామ‌ని ఫడ్నవిస్ చెప్పారు.

వికీపీడియాకు రాసిన లేఖలో మహారాష్ట్ర సైబర్ విభాగం ``కంటెంట్ మత విద్వేషాన్ని రెచ్చ‌గొడుతోంది. ఎందుకంటే ఛత్రపతి శంభాజీ మహారాజ్ భారతదేశంలో అత్యంత గౌరవనీయుడు`` అని పేర్కొంది. ఈ తప్పుడు సమాచారం ఛ‌త్ర‌ప‌తి అభిమానుల్లో అశాంతిని కలిగిస్తోంది. శాంతిభద్రతలకు ముప్పు త‌లెత్తే అవకాశం ఉంది. స‌కాలంలో స్పందించ‌క‌పోతే పరిస్థితి తీవ్రత ఎలా ఉంటుందో ఊహించ‌లేం... అని అన్నారు. చావా సినిమాతో ముడిపెడుతూ వీకీలో కంటెంట్ ని ప్ర‌జ‌లు విశ్లేషించ‌డంతో ఇప్పుడు ఫిర్యాదు చేయాల్సి వ‌చ్చింది.

Tags:    

Similar News