దేవిశ్రీ పాత వీడియో వైరల్
మరోవైపు దేవి ఇమేజ్‌కు ఇది చాలా డ్యామేజ్ చేసే విషయం కదా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
'పుష్ప-2’ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను కేవలం పాటల వరకే పరిమితం చేసి.. నేపథ్య సంగీతం వేరే మ్యూజిక్ డైరెక్టర్‌కు సుకుమార్ అప్పగిస్తున్నారనే వార్త కొన్ని రోజులుగా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై ఇంకా అధికారిక సమాచారం ఏమీ రాలేదు కానీ.. యూనిట్ వర్గాలు అయితే బీజీఎంను వేరే వాళ్లతో చేయించే విషయమై ట్రయల్స్ నడుస్తున్న మాట వాస్తవమే అని అంటున్నాయి.
ఐతే కెరీర్ ఆరంభం నుంచి దేవి తప్ప మరో సంగీత దర్శకుడితో పని చేయని సుకుమార్.. ఇలాంటి కఠిన నిర్ణయం ఎలా తీసుకున్నాడా అని ఆశ్చర్యపోతున్నారు. దీని వల్ల సుక్కు, దేవి మధ్య వ్యక్తిగత సంబంధాలు కూడా దెబ్బ తింటాయి కదా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు దేవి ఇమేజ్‌కు ఇది చాలా డ్యామేజ్ చేసే విషయం కదా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో దేవి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ టైంలో ఓ ఇంటర్వ్యూలో దేవి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. త్రివిక్రమ్ సినిమా ‘అతడు’కు తనను సంగీత దర్శకుడిగా అడిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఐతే అప్పటికే మణిశర్మను అనుకుని, ఆయన పని మొదలుపెట్టాక తనను త్రివిక్రమ్ తరఫున విజయ భాస్కర్ సంగీత దర్శకుడిగా అడిగాడని.. కానీ అప్పటకే మణిశర్మ ఆ సినిమాకు పని మొదలుపెట్టిన విషయం తెలిసి ఆయన సినిమాను తాను తీసుకోవడం నైతికంగా కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఆ సినిమాను తిరస్కరించినట్లు చెప్పాడు.
అప్పటికి తాను కెరీర్ ఆరంభ దశలో ఉన్నానని.. మహేష్ సినిమా అంటే ఎగిరి గంతేసి తీసేసుకోవాలని.. కానీ మణిశర్మ మీద ఉన్న గౌరవంతో మరో మ్యూజిక్ డైరెక్టర్ పనిని తాను తీసుకోకూడదన్న ఉద్దేశంతో ఆ సినిమాను తిరస్కరించానన్నాడు. అలాగే ‘ఇంద్ర’ సినిమా టైంలో మణిశర్మ విదేశాల్లో ఉండగా ఒక పాట చేసి పెట్టమని అశ్వినీదత్ తనను అడిగాడని.. కానీ మణిశర్మ అనుమతి లేకుండా ఆ పని తాను చేయలేనంటూ రిజెక్ట్ చేశానని దేవి వెల్లడించాడు. ఇప్పుడు దేవి చేయాల్సిన బీజీఎం పనిని సుకుమార్ అండ్ టీం వేరే వాళ్లకు అప్పగిస్తోందన్న వార్తల నేపథ్యంలో దేవి పాత వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది. దేవి అంత ఎథికల్‌గా ఉన్నపుడు తన పనిని వేరే వాళ్లకు అప్పగించడం సబబా, ఆ పనిని వేరే వాళ్లు ఎలా తీసుకుంటున్నారు అంటూ తన ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.