అప్పుడు లెజెండ్, ఇప్పుడు పుష్ప-2.. దేవిశ్రీ ఎక్కడా తగ్గేదేలే!
ఇలాంటివి సెపరేట్ గా అడిగితే పెద్దగా కిక్ ఉండదని, స్టేజ్ మీద ఇలా ఓపెన్‌గా అడిగేయాలని అన్నారు.
'పుష్ప 2: ది రూల్' సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ని కాదని, బీజీఎమ్ కోసం మేకర్స్ మరికొందరు సంగీత దర్శకులను ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. ఈ నిర్ణయంతో దేవిశ్రీ బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన వైల్డ్ ఫైర్ ఈవెంట్ వేదికగా డీఎస్పీ తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. నిర్మాతకి తన మీద ప్రేమ కంటే కంప్లయింట్స్ ఎక్కువగా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేసారు. టైంకి పాట ఇవ్వలేదని, టైంకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని అంటుంటారని తెలిపారు. ఇలాంటివి సెపరేట్ గా అడిగితే పెద్దగా కిక్ ఉండదని, స్టేజ్ మీద ఇలా ఓపెన్‌గా అడిగేయాలని అన్నారు.
నిజానికి వివాదాలకు దూరంగా ఉంటూ తన సంగీతంతోనే ఎక్కువగా పేరు తెచ్చుకున్న దేవి శ్రీ ప్రసాద్.. తనను ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం అప్పటికప్పుడే బదులు చెబుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా స్టేజ్ మీదనే కుండలు బద్దకొట్టడానికి ఎప్పుడూ వెనుకాడడు. ఇప్పుడు 'పుష్ప 2' ఈవెంట్ లో మాదిరిగానే, గతంలో 'లెజెండ్' సినిమా వేడుకలో కూడా డీఎస్పీ ఇలానే మాట్లాడారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడిన మాటలపై వేదిక మీదనే అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్శకుడి దగ్గర మైక్ తీసుకొని తాను ఎంత కష్టపడి పని చేయాలనే దాని గురించి ఇంకొకరు తనకు సూచనలు ఇవ్వాల్సిన పని లేదంటూ నవ్వుతూనే కాస్త ఘాటుగా స్పందించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
'లెజెండ్' ఈవెంట్ లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ''దేవిశ్రీ ప్రసాద్ నన్ను ఒక డైరెక్టర్ గా చూడడు. ఒక బ్రదర్ లా చూస్తాడు. సినిమా ఫస్టాఫ్ చూసి నన్ను గోధుమ పిండిలా పిసికేశారు. దానికి నేను ఊహించిన దాని కంటే ఆర్ఆర్ డబుల్ ఇచ్చాడు. చెన్నైలో నేను 13 రోజుల పాటు దేవిశ్రీతో ఉండి, పొరపాటున కూడా ఒక్క రోజు కూడా నిద్ర పోనివ్వకుండా దగ్గరుండి ఆర్ఆర్ చేయించాను. బేసిక్ గా ప్రీ మిక్స్ కి, ఫైనల్ మిక్స్ కి తను బయటకు రాడు. మనకి వదిలేస్తాడు. అలాంటి ఆయన్ని తీసుకొచ్చి ప్రసాద్ ల్యాబ్స్ లో పడేసి 52 గంటలు పాపం..'' అంటూ ఏదో చెప్పబోయారు. దీంతో పక్కనే ఉన్న దేవిశ్రీ మైక్ అందుకొని అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని బోయపాటి మాటలపై అభ్యంతరం తెలిపారు.
"నేను మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకూ ప్రతీ సినిమాకి ఫైనల్ మిక్స్ అయ్యే వరకూ నేను థియేటర్లోనే ఉంటాను. ఎందుకంటే అది నా జాబ్. 13 రోజులు ఆయన నాతో లేరు. సెకండాఫ్ ఆర్ఆర్ చేస్తున్నప్పుడు రెండు మూడు రోజులు వచ్చారు. నా ల్యాప్ టాప్ లో ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ కూర్చున్నారు. నేను చేశాననే గొప్ప కోసం ఇది చెప్పడం లేదు. నాతో పాటు చాలామంది వర్క్ చేసారు. ఎవరి క్రెడిట్ వాళ్లకు ఇవ్వాలి. రీరికార్డింగ్ అంటే నాకు ప్రాణం. ఆయన సినిమా ఎక్ట్రార్డినరీగా తీశారు. దానికి రీరికార్డింగ్ చేశాను కాబట్టి, రీరికార్డింగ్ నేనే చేశాను. అదీ నా యాటిట్యూడ్'' అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.
''13 రోజులు పడుకోకుండా అన్నారు. కానీ నాకు ఎవరి చెకింగ్ అక్కర్లేదు. ఒకసారి జాబ్ నా చేతిలో పెట్టారు అంటే.. మీరే నిద్రపొమ్మన్నా నేను నిద్రపోను. నిద్రపోవద్దు, కూర్చొని చేయండి అని నాకు ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చినా నేను వినను. ఎందుకంటే నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు. ఇది నేను తప్పుగా చెప్పడం లేదు. నేను ఫస్టాఫ్ చూసి ఎలాగైతే ఆయన్ను కౌగిలించుకున్నానో, ఆర్ఆర్ చూసి షాకై ఆయన కూడా నన్ను అలానే కౌగిలించుకున్నారు. ఇప్పుడు నేను చెప్పేదంతా పాజిటివ్ గానే. నేను నెగిటివ్ గా చెప్పడం లేదు. అది మీరు గ్రహించాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది''
''ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నిద్రా హారాలు లేకుండా ఎన్ని రోజులు వర్క్ చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. నేను అలానే ఎదిగాను.. అలానే జీవిస్తున్నాను. నేను నా మ్యూజిక్ కోసమే జీవిస్తున్నాను. నేను బయటకు పార్టీలకు వెళ్ళను.. ఎవరితోనూ తిరగను. నేను లైఫ్ లో మ్యూజిక్ మాత్రమే చేస్తాను. నాకు క్రెడిట్ ఇవ్వండి, ఇవ్వకపోండి.. నాకు సంబంధం లేదు. కానీ ఒకరు చెప్తేనే నేను నిద్రపోలేదనో, లేదా నేను హింసపెట్టి చేయించుకున్నామనో అనడం సరికాదు. గతంలో ఓ ఆడియో ఫంక్షన్ లో మేం పిండుకున్నాం అని అంటే, వెంటనే మైక్ తీసుకొని 'ఎవరో నన్ను పిండుకోవాల్సిన అవసరం లేదు. పిండుకోడానికి నేనేమన్నా ఆవునా?' అని అన్నాను"
''నిద్రపోవద్దు, కష్టపడి పనిచేయండి అని చెప్పడానికి, నేను సినిమాని నెగ్లెట్ చేసే స్థితికి నేను దిగజారలేదు. ఎప్పుడూ దిగజారను. సినిమా నా ఫస్ట్ ప్యాషన్.. మ్యూజిక్ నా ఫస్ట్ లవ్. సో నేను ఎంత కష్టపడి పని చేయాలనే దాని గురించి ఇంకొకరు నాకు ఇన్స్ట్రక్ట్ చెయ్యాల్సిన పని లేదు. నా హార్డ్ వర్క్ తోనే నేను ఇక్కడిదాకా వచ్చాను. నేను చాలా సిన్సియర్. నేను ఎప్పుడూ నిజమే మాట్లాడతాను'' అని దేవిశ్రీ చెప్పుకొచ్చారు. దీంతో బోయపాటి శ్రీను మైక్ అందుకొని.. ''దేవీ నేను చెప్పేది మీరు పూర్తిగా వినలేదు. నేను చెప్పాలనుకున్నది కూడా అదే. నిద్రాహారాలు మాని మీరు చేసారు అని చెప్పాలనే ఉద్దేశ్యంతోనే నేను మాట్లాడటం స్టార్ట్ చేసాను. కానీ అంతలోనే మీరు ఎంటర్ అయ్యారు. మీరు ఎంత కష్టపడ్డారు అనేది చెప్పడమే నా ఉద్దేశ్యం'' అని వివరణ ఇచ్చారు.
అప్పుడు 'లెజెండ్' సినిమా ఈవెంట్ లో జరిగినట్లే, సరిగ్గా పదేళ్ల తర్వాత ఇప్పుడు 'పుష్ప 2' ఈవెంట్ లో జరిగింది. "మనకు ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలి. అది నిర్మాతల దగ్గర పేమెంట్ అయినా, స్క్రీన్ మీద వచ్చే మన క్రెడిట్ అయినా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు" అని దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అలానే నిర్మాత రవిశంకర్ ను ప్రస్తావిస్తూ.. "నేను స్టేజ్ మీద ఎక్కువసేపు మాట్లాడానని నన్ను ఏమీ అనొద్దు. ఎందుకంటే.. నేను టైంకి పాట ఇవ్వలేదు, టైంకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, టైంకి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటుంటారు. మీకు నాపై చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నప్పుడు కంప్లెయింట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద మీకు ప్రేమ కంటే కంప్లైట్స్ ఎక్కువగా ఉంటాయి ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా రాంగ్ టైమింగ్, లేట్ అన్నారు. ఇవ్వన్నీ సెపరేట్ గా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్‌గా అడిగేయాలి. సో నేనెప్పుడూ ఆన్ టైం'' అని డీఎస్పీ అన్నారు. ఈ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి.