Begin typing your search above and press return to search.

దేవియాని శర్మ లాంగ్ పోస్ట్.. ఎవరి కోసమో?

ఢిల్లీ బ్యూటీ దేవియాని శర్మ.. టాలీవుడ్ లో తన యాక్టింగ్ తో తక్కువ టైమ్ లోనే మంచి పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Nov 2024 1:30 AM GMT
దేవియాని శర్మ లాంగ్ పోస్ట్.. ఎవరి కోసమో?
X

ఢిల్లీ బ్యూటీ దేవియాని శర్మ.. టాలీవుడ్ లో తన యాక్టింగ్ తో తక్కువ టైమ్ లోనే మంచి పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన ప్రాజెక్టులతో పాటు రోల్స్ ఎంచుకుంటూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. భానుమతి రామకృష్ణ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. ఫస్ట్ మూవీతో అనుకున్నంత స్థాయిలో హిట్ కొట్టలేకపోయారు.

కానీ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత రొమాంటిక్ మూవీలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. సేవ్ ది టైగర్స్, సైతాన్ వెబ్ సిరీసులతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో చెప్పనక్కర్లేదు. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. ఎప్పటికప్పుడు నెట్టింట సందడి చేసే అమ్మడు.. తాజాగా లాంగ్ పోస్ట్ పెట్టారు.

స్త్రీల విలువను అర్థం చేసుకోని పురుషులకు బహిరంగ లేఖ అంటూ సుదీర్ఘంగా పోస్ట్ చేశారు దేవియాని. "ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది పురుషులు స్త్రీలను గౌరవించడంలో విఫలమవుతున్నారో చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ప్రేమ, మద్దతు, సమయం అన్నీ ఇచ్చే వ్యక్తిని కేవలం ప్రేక్షకురాలిగా ఎందుకు పరిగణిస్తారు?" అని ప్రశ్నించారు.

"పురుషులు స్త్రీలను ఎందుకు వెంబడిస్తారు? వారు కోరుకున్నది పొందే వరకు మాత్రమేనా? వారు సంతృప్తిని చేరుకునే వరకేనా? వారు దానిని సంపాదించిన తర్వాత ఆసక్తి తగ్గుతుందా? కొంతమంది పురుషులు కేవలం మాటలతో కాకుండా తమ చర్యల ద్వారా విధేయతను చూపడం ఎందుకు చాలా కష్టం?" అని సూటిగా ప్రశ్నించారు దేవియాని శర్మ.

"పరస్పరం గౌరవం లేకపోవడం, నిరంతరం నిందలు వేయడం, ఒక భాగస్వామి తమను విడిచిపెట్టినట్లు భావించడం, విడాకులు కోరడం వంటి పరిస్థితుల్లో ఉన్న వారిని చూస్తే హృదయ విదారకంగా ఉంటుంది. కొంతమంది పురుషులు తమ అహంకారం కారణంగా స్త్రీలపై పైచేయి సాధించారని నమ్ముతారు" అని దేవియాని ఆరోపించారు.

"మీరు(పురుషులు) ప్రేమించే శక్తి కలిగి ఉంటారు. కానీ అగౌరవం ఆమోదయోగ్యం కాదు. ఇతరుల భావోద్వేగాలు, మానసిక భద్రతతో ఎందుకు ఆడుకోవాలి? ప్రేమ పేరుతో భావోద్వేగాలతో ఆడుకోవడం హాస్యాస్పదంగా ఉంది" అంటూ రాసుకొచ్చారు. దీంతో దేవియాని శర్మ లాంగ్ పోస్ట్ వెనుక కారణమేంటోనని ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఎవరిని ఉద్దేశించే పెట్టారోనని సోషల్ మీడియాలో తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.