బ్లాక్ బస్టర్ స్ఫూర్తితో ఓకే.. కాపీ చేస్తేనే నాట్ ఓకే!
ఈ సినిమాలో ఉన్న గమ్మత్తయిన విషయం ధనుష్ సినిమాలో ఉంటే ఆదరణ పొందే ఛాన్సుంది. కానీ అదే తరహాలో ఉంటే పోలికలు చూస్తారు.
దర్శకులు హీరోలు అవుతున్నారు.. హీరోలు దర్శకులు అవుతున్నారు. కొందరు హీరో కం డైరెక్టర్ గా రెండు పడవలపైనా ప్రయాణిస్తున్నారు. అయితే ద్విపాత్రలు పోషించి సక్సెసయ్యేవారు అతి కొద్ది మంది. తాను హీరోగా నటిస్తూనే దర్శకుడిగా రాణించేందుకు తమిళ స్టార్ హీరో ధనుష్ చేయని ప్రయత్నం లేదు. ఇటీవల ధనుష్ తన 50వ చిత్రం 'రాయన్'కి దర్శకత్వం వహిస్తూ వార్తల్లో నిలిచాడు. ఈ చిత్రం జూలై 26న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకి రచయిత- దర్శకుడు కూడా ధనుష్. థియేట్రికల్ ట్రైలర్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో అభిమానులను రంజింపజేసింది.
ఈ సినిమా రిలీజ్ కి వస్తుండగానే ధనుష్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్ట్ చేసేందుకు ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ధనుష్ NEEK (నిలవుకు ఎన్మెల్ ఎన్నాడి కోపం) అనే మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 2023 చివరిలో ప్రారంభమైంది. కొన్ని పోస్టర్‌లను ఆవిష్కరించగా చక్కని స్పందన వచ్చింది. రాయన్‌లో కీలక పాత్ర పోషించిన ఎస్‌జే సూర్య ఇప్పుడు నీక్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. బ్లాక్ బస్టర్ మూవీ 'ప్రేమలు' స్టైల్‌లో విస్తారమైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో నీక్ ఉంటుందని తెలిపారు.
నిజానికి స్టార్స్ లేకపోయినా ప్రేమలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఓటీటీలోను చక్కని ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాలో ఉన్న గమ్మత్తయిన విషయం ధనుష్ సినిమాలో ఉంటే ఆదరణ పొందే ఛాన్సుంది. కానీ అదే తరహాలో ఉంటే పోలికలు చూస్తారు. విమర్శించేవారు విమర్శిస్తారు. మరి దర్శకుడిగా ధనుష్ తనదైన మార్క్ ని చూపించాల్సి ఉంటుంది. నీక్ చిత్రంలో అనికా సురేంద్రన్, పవిష్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. నీక్ తర్వాత కూడా ధనుష్ మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. అలాగే ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న శేఖర్ కమ్ముల చిత్రం కూడా విడుదల కావాల్సి ఉంది.