మళ్లీ అదే కథ.. ఇక్కడ ఫ్లాప్ అక్కడ హిట్
ఒకప్పుడు తమిళ అనువాదాలు తెలుగులో ఇరగాడేసేవి. కానీ గత కొన్నేళ్లలో వాటి సక్సెస్ రేట్ బాగా పడిపోయింది
ఒకప్పుడు తమిళ అనువాదాలు తెలుగులో ఇరగాడేసేవి. కానీ గత కొన్నేళ్లలో వాటి సక్సెస్ రేట్ బాగా పడిపోయింది. తమిళ చిత్రాల్లో క్వాలిటీ పడిపోవడం, అదే సమయంలో తెలుగు చిత్రాల రేంజ్ పెరగడం అందుకు కారణం అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు కోలీవుడ్ నుంచి ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు వచ్చేవి. మన సినిమాల ముందు అవి చాలా కొత్తగా అనిపించేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.
రొటీన్ సినిమాలతోనే సరిపెట్టేస్తున్నారు అక్కడి దర్శకులు. ఒకప్పుడు కొత్తదనానికి పట్టం కట్టిన తమిళ ప్రేక్షకులు కూడా ఇప్పుడు మామూలు సినిమాలనే నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తమిళంలో టాప్ స్టార్లైన విజయ్, అజిత్ చేసే సినిమాలన్నీ చాలా రొటీన్‌గానే ఉంటాయి. టాక్ కూడా గొప్పగా ఉండదు. అయినా అవి ఇరగాడేస్తుంటాయి. మిగతా హీరోల సినిమాలూ ఇంతే. తెలుగులో పెద్దగా ప్రభావం చూపకపోయినా తమిళంలో మాత్రం బాగా ఆడిన సినిమాల జాబితాలోకి కొత్త చిత్రం వచ్చింది. అదే.. రాయన్.
ధనుష్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి తమిళంతో పోలిస్తే తెలుగులో అంత మంచి టాక్ రాలేదు. రొటీన్ కథనే స్టైలిష్ టేకింగ్‌తో కొంతమేర నిలబెట్టే ప్రయత్నం చేశాడు ధనుష్. ధనుష్, సందీప్ కిషన్, ఎస్.జె.సూర్య పెర్ఫామెన్సులు బాగున్నాయి.
ఐతే మన వాళ్లకు ఈ సినిమా అందించిన కిక్కు సరిపోలేదు. ఈ చిత్రానికి తెలుగులో ఓపెనింగ్స్ అంతంతమాత్రంగానే వచ్చాయి. వీకెండ్ తర్వాత ప్రేక్షకులు పెద్దగా ఈ చిత్రాన్ని పట్టించుకోవడం లేదు. గత నెల సినిమా ‘కల్కి’కే ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీలు ఇస్తున్నారు. కానీ ‘రాయన్’ తమిళంలో మాత్రం సూపర్ హిట్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. రూ.70 కోట్లతో ధనుష్ కెరీర్ లోనే అత్యధిక వీకెండ్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘రాయన్’ నిలిచింది. త్వరలోనే వంద కోట్ల మార్కును కూడా అందుకోబోతోంది.