స్టూడియోలే లాభాలు కొట్టేస్తున్నాయని అగ్రనిర్మాత తెలివిగా!
అపరిమిత బడ్జెట్లతో సాహసాల కంటే, పెద్ద రాబడిని ఇచ్చే మధ్యస్థ బడ్జెట్ చిత్రాన్ని వెంబడిస్తున్నాను.. అని అన్నారు.
``ప్రతి ఒక్కరూ సినిమా పెద్దది.. సంపాదించిన డబ్బు పెద్దది అని అనుకుంటారు.. కానీ అది నిజం కాదు``అని అన్నారు ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్. పెద్ద చిత్రాలతో కోలుకునే ప్రయాణం చాలా పొడవుగా సుదీర్ఘంగా ఉంటుందని, మార్జిన్లు పెద్దగా ఉండవని కరణ్ అన్నారు. కానీ రూ. 65 కోట్ల నుండి రూ. 80 కోట్ల విండోలో సినిమా తీసి అది పెద్ద హిట్టయితే అదే నేను వెంటాడుతున్న సినిమా. అపరిమిత బడ్జెట్లతో సాహసాల కంటే, పెద్ద రాబడిని ఇచ్చే మధ్యస్థ బడ్జెట్ చిత్రాన్ని వెంబడిస్తున్నాను.. అని అన్నారు.
కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌లో 50 శాతం వాటాను ఎందుకు విక్రయించాడో తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇటీవలే సీరమ్ ఇనిస్టిట్యూట్ చీఫ్ అదార్ పూనావల్లకు ధర్మ ప్రొడక్షన్స్ లోని 50 శాతం వాటాను విక్రయించిన తర్వాత తన సంస్థ విస్తరణ ప్రణాళికల గురించి కరణ్ వివరిస్తూ..ఇకపై మధ్యస్థ బడ్జెట్ చిత్రాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తానని అన్నారు. వీలైనన్ని ఎక్కువ ప్రాజెక్టులకు స్వయంగా నిధుల సమకూర్చడమే లక్ష్యమని, తద్వారా ఆదాయం మొత్తం ఇంట్లోనే ఉంటుందని కరణ్ చెప్పారు. భారీ బడ్జెట్ ప్రాజెక్టులపై తనకు ఇంకా బయటి నుంచి సహాయం కావాల్సి ఉంటుందని అందుకే చిన్న బడ్జెట్ చిత్రాలే నయం అని అన్నారు.
నిధులు తేవడంలో అసలు సమస్య ఏమిటంటే మేము ఎల్లప్పుడూ పెద్ద చిత్రాలలో ఇప్పటికే ఉన్న స్టూడియోతో భాగస్వామిగా ఉండాలి. అలా కాకుండా ఒక భాగస్వామితో ఫండింగ్ చేయడం సొంత ఇంట్లో పెట్టుబడిలా ఉంటుందని అందుకే ఆదార్ పూనవల్లాతో 50శాతం భాగస్వామ్య ఒప్పందం జరిగిందని కరణ్ సీఎన్‌బిసి ఇంటర్వ్యూలో అన్నారు. పెద్ద హిట్ లు కొట్టినా బయటి స్టూడియోతో లాభాలు పంచుకోవాలి. కానీ ఇప్పుడు సినిమాను మేం పూర్తిగా సొంతం చేసుకుంటున్నాం. ఇకపై భారీ బ్రహ్మాస్త్రాలుంటాయి. నిజానికి రూ. 250 కోట్లకు పైగా లేదా రూ. 300 కోట్లకు పైగా సినిమా చేస్తే, ఇప్పుడు మా దశలో కూడా పూర్తిగా నిధులు సమకూర్చడం సాధ్యం కాదని, అయితే చాలా చిన్న సినిమాలను నిర్మించడమే తన లక్ష్యమని కరణ్ చెప్పాడు. స్వయంగా నిధులు చేకూర్చే చిత్రాలతో లాభాలు అధికమని కూడా కరణ్ తెలిపాడు. మధ్యస్త బడ్జెట్ చిత్రాల నుంచే అధిక లాభాలొస్తాయని కూడా అనుభవాన్ని వివరించారు కరణ్. నిజానికి ధర్మ ప్రొడక్షన్స్ లో నిర్మించిన బ్రహ్మాస్త్ర 400కోట్లతో తెరకెక్కి కేవలం 420కోట్లు మాత్రమే వసూలు చేసింది. దానికంటే జగ్ జగ్ జియో, బ్యాడ్ న్యూజ్ లాంటి చిన్న బడ్జెట్ చిత్రాలు భారీ లాభాలను అందించాయి. అందుకే అతడు మీడియం బడ్జెట్ చిత్రాలపై ఆసక్తిని కనబరుస్తున్నారు.