త‌ప్ప తాగి డైరెక్ట‌ర్‌కి కాల్ చేసిన స్టార్ హీరో!

గ్లామ‌ర్ ప్ర‌పంచంలో పోటీత‌త్వం అనేది ఈరోజుల్లో పుట్టుకొచ్చిన‌ది కాదు. క్లాసిక్ డే మెమ‌రీస్ లో స్టార్ల‌కు ఇది అనుభ‌వం.

Update: 2024-12-30 04:30 GMT

గ్లామ‌ర్ ప్ర‌పంచంలో పోటీత‌త్వం అనేది ఈరోజుల్లో పుట్టుకొచ్చిన‌ది కాదు. క్లాసిక్ డే మెమ‌రీస్ లో స్టార్ల‌కు ఇది అనుభ‌వం. ఫ‌లానా సీనియ‌ర్ హీరోకి ద‌క్కాల్సిన‌ అవ‌కాశాన్ని అప్ప‌టి కొత్త‌త‌రం న‌టుడు లాక్కున్నాడ‌ని.. లేదా సాటి హీరో కుట్ర చేసి త‌న‌ను త‌ప్పించాడ‌ని, ఎదుగుదల చూడ‌లేక కుట్ర చేసార‌ని ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు వినిపిస్తుంటాయి.

అయితే అలాంటి ఒక ఘ‌ర్ష‌ణ బాలీవుడ్ వెట‌ర‌న్ హీరోలు రాజేష్ ఖ‌న్నా- ధ‌ర్మేంద్ర మ‌ధ్య ఉంది. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తొలుత ధ‌ర్మేంద్ర‌కు క‌థ చెప్పి ఓకే అన్న త‌ర్వాత దానిని రాజేష్ ఖ‌న్నాతో తీశారు. దీంతో ధ‌ర్మేంద్ర‌ తీవ్రంగా క‌ల‌త చెందారు. ఈ ప‌ని స‌రికాద‌ని ఫిలింమేక‌ర్స్ పై విరుచుకుప‌డ్డారు.

రాజేష్ ఖన్నా సినీకెరీర్ లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఆనంద్ చిత్రం ఒకటి. ఆ అవ‌కాశాన్ని ధ‌ర్మేంద్ర కోల్పోయారు. 2019లో ది కపిల్ శర్మ షోలో ధ‌ర్మేంద్ర స్వ‌యంగా ఈ వివాదంపై మాట్లాడారు. బ్లాక్ బ‌స్ట‌ర్ ఆనంద్‌లో తనకు బదులుగా రాజేష్ ఖన్నాను నటింపజేసినట్లు తెలుసుకున్న తర్వాత తాను ఫిల్మ్ మేకర్ హృషికేష్ ముఖర్జీకి తాగి ఫోన్ డయల్ చేశానని వెల్లడించాడు.

అలా చేయ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. మొద‌ట‌ ఫ్లైట్‌లో ఉన్నప్పుడు ఫిలిమ్ మేక‌ర్ హృషికేష్‌ ఆనంద్ కథను తనకు చెప్పారని, తాను సినిమాలో భాగం కావాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. అయితే ఆ చిత్ర నిర్మాత రాజేష్ ఖన్నాను ఎంపిక చేసుకోవ‌డంతో ధర్మేంద్రకు కోపం వచ్చింది. హృషికేశ్‌కు తాగి డయల్ చేసి మాట్లాడినట్లు వెల్లడించారు.

నేను రాత్రంతా హృషిఖేష్ ను నిద్రపోనివ్వలేదు..నాకు అవ‌కాశం ఇస్తానని కథ చెప్పావు.. అలాంట‌ప్పుడు అతడికి ఎందుకు సినిమా ఇచ్చావు? అని ప్ర‌శ్నించిన‌ట్టు తెలిపారు. కాల్ కట్ చేసి పడుకోమని హృషికేశ్ ముఖర్జీ తనను కోరినట్లు ధర్మేంద్ర తెలిపారు. అయినా కానీ తాను మళ్ళీ మ‌ళ్లీ అతడికి కాల్ చేస్తూనే ఉన్నాడు. విసిగిస్తూనే ఉన్నాడు.

1971లో విడుదలైన ఆనంద్ చిత్రం లో అమితాబ్ బచ్చన్ , రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్ర‌జ‌ల నుంచి గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కింది. విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు కురిసాయి. నేటికీ ఆనంద్‌ను బాలీవుడ్ క్లాసిక్‌గా పరిగణిస్తారు. ఈ సినిమా మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా రికార్డుల‌కెక్కింది.

అత్యంత పాపుల‌ర్ ద‌ర్శ‌కుడు:

హృషికేశ్ ముఖర్జీ బాలీవుడ్ `మిడిల్ సినిమా`కి మార్గదర్శకత్వం వహించిన దర్శకుడు. అతడి కాలంలో దూరదృష్టి గల దార్శ‌నికుడు. ద‌ర్శ‌కుడిగా అత‌డు తెర‌కెక్కించిన‌ రొమాంటిక్ డ్రామాలు, స్క్రూబాల్ కామెడీలు గొప్ప ప్రజాదరణ పొందాయి. ఆర్ట్ సినిమా.. రియలిస్టిక్ సినిమాల‌ మధ్య సరైన సమతుల్యతను సాధించడంతో ముఖర్జీ అత్య‌ద్భుత‌మైన క్లాసిక్స్ ని అందించ‌గ‌లిగారు. వీటిలో ఆనంద్, నమక్ హరామ్, గోల్ మాల్, చుప్కే చుప్కే స‌హా మరెన్నో ఉన్నాయి.

Tags:    

Similar News