నమ్మకం లేదు దొరా... దర్శకుడికి కౌంటర్‌!

కోలీవుడ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా అప్పుడప్పుడు వినిపిస్తున్న పేరు 'ధృవ నచ్చత్తిరమ్‌'. విక్రమ్‌ హీరోగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దాదాపు ఏడు ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తుంది.

Update: 2025-02-28 12:30 GMT

కోలీవుడ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా అప్పుడప్పుడు వినిపిస్తున్న పేరు 'ధృవ నచ్చత్తిరమ్‌'. విక్రమ్‌ హీరోగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దాదాపు ఏడు ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తుంది. గత ఏడాదిలో కచ్చితంగా విడుదల చేసి తీరుతాను అంటూ గౌతమ్‌ మీనన్ ప్రకటించాడు. కానీ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా సినిమాను విడుదల చేయలేక పోతున్న గౌతమ్‌ మీనన్‌ ఈ ఏడాదిలో సినిమాను విడుదల చేస్తాను అంటూ ప్రకటించాడు. ఇటీవల సినిమాను మే 1న విడుదల చేస్తాను అంటూ ఒక చిట్‌చాట్‌లో గౌతమ్‌ మీనన్ అధికారికంగా ప్రకటించాడు. గౌతమ్ వ్యాఖ్యలను జనాలు పట్టించుకోవడం లేదు.

ఇప్పటి వరకు ధృవ నచ్చత్తిరమ్‌ సినిమా దాదాపుగా పది సార్లు వాయిదా పడి ఉంటుంది. గత ఏడాది విడుదల తేదీ ప్రకటించి, రిలీజ్‌కి ఒకటి రెండు రోజుల ముందు క్యాన్సల్‌ అయింది. దాంతో ఈ సినిమాను విడుదల చేయడం గౌతమ్ మీనన్‌ వల్ల కాదని తమిళ్ మీడియా వర్గాల వారితో పాటు అంతా అనుకుంటున్నారు. విక్రమ్‌ ఈ సినిమా గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశాడు. ఆయన ముందు సినిమా గురించి ప్రస్తావించిన మౌనంగా ఉంటున్నారు. ఆయన సినిమా విడుదలపై నమ్మకం పెట్టుకోలేదు. కానీ దర్శకుడు గౌతమ్‌ మీనన్ మాత్రం సినిమాను విడుదల చేయడం కోసం సాధ్యం అయినప్పుడల్లా ప్రయత్నాలు చేస్తున్నాడు.

కోలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ధృవ నచ్చత్తిరమ్‌ సినిమాను విడుదల చేయడం కోసం గౌతమ్ మీనన్ వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. సినిమాల్లో నటించడం ఆయన ఆసక్తిగా లేకున్నా కేవలం డబ్బుల కోసం నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాల్లో నటించగా వచ్చిన డబ్బుతో విక్రమ్‌ సినిమాను విడుదల చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మే 1న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా గౌతమ్ మీనన్ ప్రకటించడంతో చాలామంది నెటిజన్స్ మాకు నమ్మకం లేదు దొరా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు నమ్మినం.. ఇకపై నమ్మే అవకాశం లేదని వారు అంటున్నారు.

ధృవ నచ్చత్తిరమ్‌ సినిమాను ధృవ నక్షత్రం టైటిల్‌తో డబ్‌ చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఒరిజినల్‌ భాషలోనే విడుదల కావడం లేదు, ఇక డబ్‌ చేసి విడుదల చేయడం ఎంత వరకు సాధ్యమో అర్థం చేసుకోవచ్చు. గౌతమ్‌ మీనన్‌ ఈసారి కాస్త నమ్మకంగా కనిపిస్తున్నారు. మరి మే 1న ఆయన సినిమాను విడుదల చేస్తాడా అనేది చూడాలి. ధృవ నచ్చత్తిరమ్‌ సినిమాను రెండు పార్ట్‌లుగా గౌతమ్‌ మీనన్‌ రూపొందించారు. మొదటి పార్ట్‌ను మే 1న విడుదల చేస్తే రెండో పార్ట్‌ ఆ వెంటనే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్క పార్ట్‌కే ఇన్ని కష్టాలు పడుతున్న గౌతమ్‌ మీనన్ రెండు పార్ట్‌లుగా సినిమాను ఎలా అనుకున్నాడు అంటూ చాలా మంది కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News