కన్నడ 'మార్టిన్'.. హిట్టా ఫట్టా?

ధృవ సర్జ హీరోగా నటించిన "మార్టిన్" సినిమా రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2024-10-13 06:07 GMT

ధృవ సర్జ హీరోగా నటించిన "మార్టిన్" సినిమా రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కన్నడ పరిశ్రమలో మాస్ హీరో ఇమేజ్ ఉన్న ధృవ సర్జకు ఒక ప్రత్యేకమైన ప్రయత్నం, కానీ తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమా మీద పెద్ద అంచనాలు లేవు. అయితే ట్రైలర్ తో జనాలు ఏదో కొత్తగా ఉందని ఊహించారు. కానీ కంటెంట్ విషయంలో మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

కథలో మార్టిన్ అనే కస్టమ్స్ ఆఫీసర్ పాకిస్థాన్ జైలులో అనుకోకుండా ఇరుక్కుపోవడం, అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల తన గతాన్ని మర్చిపోవడం మేజర్ పాయింట్. ఆ తర్వాతి స్టోరీ వివిధ కారణాల చుట్టూ తిరుగుతుంది. కథ కొత్తదేమీ కాకపోయినా, కథనం ప్రెజెంటేషన్ లో దర్శకుడు ఏపి అర్జున్ చాలా జాగ్రత్తగా చేయాల్సింది. కానీ కథానాయకుడి నటన, కథను ముందుకు నడిపించే తీరు మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.

ఒక్క ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను కట్టిపడేసేలా చేయకపోవడంతో సినిమా బోర్‌గా మారింది. సినిమాలో అవసరం లేకుండా చేసిన ఓవర్‌ ఎలివేషన్లు, పాత్రల మధ్య సరైన కోనెక్షన్ లేకపోవడం ప్రధానంగా సినిమా నెగెటివ్ పాయింట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ధృవ సర్జతో పాటు ఇతర ఆర్టిస్టుల నటనను చూస్తే, కొన్ని సన్నివేశాల్లో అతి నటనతో సినిమాను మరింత వెనక్కి తీసుకెళ్లిందనే చెప్పాలి.

సినిమా టెక్నికల్ పరంగా కూడా ఎన్నో తప్పులు ఉన్నాయి. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిచోటా మితిమీరిన శబ్ద కాలుష్యంలా మారి, ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది. కథకూ, సంగీతానికీ మధ్య సరైన బ్యాలెన్స్ లేకపోవడం సినిమాను బాగా దెబ్బతీసింది. మణిశర్మ అందించిన పాటలు కూడా సినిమాకి పెద్దగా సహాయపడలేదు.

అసలు పాటలు ఎందుకు సినిమాలో ఉన్నాయో అన్నట్టు అనిపించింది. ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలు కూడా క్లారిటీ లేకుండా ప్రెజెంట్ చేయడం సినిమాకు ఇంకో నెగెటివ్ పాయింట్. సినిమా ఎఫెక్ట్స్ కూడా అంచనాల్ని చేరుకోలేదు, ముఖ్యంగా గ్రాఫిక్స్ పరంగా నాణ్యత లేకపోవడం స్పష్టంగా కనిపించింది. మొత్తంగా, "మార్టిన్" సినిమా కేవలం ట్రైలర్‌కి ఆకర్షితులైన వారిని మాత్రమే థియేటర్‌కి రప్పించింది.

కానీ, ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. మాస్ ఎలిమెంట్స్‌కి సంబంధించిన సినిమాలు చూసే ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసిన తర్వాత పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయారు. ఇలాంటి మాస్ సినిమాలకు ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేది యాక్షన్ ఎపిసోడ్స్ కు, కానీ ఆ విషయంలో దర్శకుడు విఫలమయ్యాడు. కన్నడలోనే పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు. ఇక తెలుగులో ఈ సినిమా వీకెండ్ తర్వాత కనిపించకపోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News