గౌతమ్ మీనన్ 2.40కోట్లు చెల్లించలేకపోతే..!
రేపు ఉదయం 10:30 గంటలలోపు కోర్టులో రూ. 2.40 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలని, ధృవ నచ్చతిరమ్‌ని సకాలంలో విడుదల చేయాలని గౌతమ్ మీనన్‌ని కోర్టు ఆదేశించింది.
ప్రతిభావంతుడైన స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ని కష్టాలు ఇప్పట్లో వదిలేట్టు లేవు. అతడు అనుకున్నది ఒకటి.. అయినది ఇంకొకటి. అతడు ఎంతగానో ఎదురుచూసిన బిగ్ డేట్ రానే లేదు. అతడి చిత్రం 'ధృవ నచ్చతిరమ్' విడుదల ఆర్థిక సంక్షోభం కారణంగా సందిగ్ధంలో పడింది. రిలీజ్ ముందు కోర్టు తీర్పు అభిమానులను గందరగోళంలో పడేలా చేసింది. గతంలో పలు ఇంటర్వ్యూలలో ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఈ సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నానని గౌతమ్ స్వయంగా వెల్లడించాడు. దాని నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నానని, ఏదోలా ధృవనచ్చతిరమ్ సినిమాని రిలీజ్ చేస్తానని అన్నాడు.
కానీ ఈ సినిమా విడుదల విషయంలో సమస్య సద్ధుమణగలేదు. ఇప్పుడు చెన్నై హైకోర్టులో 8 కోట్ల రూపాయల చెల్లింపును సమర్పించాలని తీర్పు వెలువడింది.. చియాన్ విక్రమ్-నటించిన ధృవనచ్చతిరమ్ చిత్రం విడుదల కావాలంటే గౌతమ్ మీనన్ ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందే. గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమా విడుదలవ్వాలంటే, నిర్మాత ఆల్ ఇన్ పిక్చర్స్‌కు తిరిగి చెల్లించే విషయంలో గౌతమ్ డబ్బుతో రెడీ కావాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఉదయం 10:30 గంటలలోపు కోర్టులో రూ. 2.40 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలని, ధృవ నచ్చతిరమ్‌ని సకాలంలో విడుదల చేయాలని గౌతమ్ మీనన్‌ని కోర్టు ఆదేశించింది.
అయితే ధృవ నచ్చతిరమ్ ఇదే గాక.. వేరే విధంగాను ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఎందుకంటే కోట్లాది రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం శాటిలైట్ - డిజిటల్ హక్కులు ఇంకా అమ్మకం కాలేదు. దీంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారా అంతో ఇంతో ఆర్జించి అప్పులు తీర్చేయాలనుకున్న గౌతమ్ మీనన్ కి ఆ అవకాశం చిక్కలేదు.
కోర్టు సెటిల్మెంట్ తర్వాతే విడుదల:
ధృవ నచ్చతిరమ్ విడుదల విషయంలో దర్శకుడికి ఈరోజు వచ్చిన కోర్టు ఆదేశం నిజంగానే ఇబ్బందికరంగా మారింది. గౌతమ్ తన చిత్రాన్ని పేర్కొన్న సమయంలో విడుదల చేయాలంటే ఇచ్చిన నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా అతడు డబ్బు అప్పు చేసి అయినా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ చిత్రం 2016 నుండి మేకింగ్ దశలో ఉంది. ఇప్పటి వరకు ప్రొడక్షన్ పెండింగ్ లో ఉండగా, తర్వాత సినిమాను విడుదల చేయాలని ఆశించారు. సినిమా రిలీజ్ లేటయినా కానీ తన చిత్రంపై ఆ ప్రభావం ఉండదని దర్శకుడు గౌతమ్ మీనన్ చెప్పినప్పటికీ, సినిమా పదే పదే ఆలస్యం కావడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది.
దీనికి తోడు గౌతమ్ మీనన్ ఆన్‌లైన్ - ఆఫ్‌లైన్ పద్ధతుల ద్వారా చిత్రాన్ని చురుకుగా ప్రమోట్ చేసాడు కానీ, చిత్ర కథానాయకుడు చియాన్ విక్రమ్ ఎటువంటి ప్రచార కార్యక్రమాలలో పాల్గొనలేదు. సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి ఏదైనా పోస్ట్ చేయడం కూడా ఆయన మానుకున్నారు. విక్రమ్ నిష్క్రియాత్మకత అభిమానులలో కూడా కొంత అసహనానికి దారితీసింది.
ధృవ నచ్చతిరం గురించి
ధృవ నచ్చతిరమ్ అనేది గౌతమ్ వాసుదేవ్ మీనన్ రచన, నిర్మాణం , దర్శకత్వం లో వస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్. చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రీతూ వర్మ, ఆర్ పార్తిబన్, సిమ్రాన్, రాదికా శరత్‌కుమార్, వినాయకన్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఒక రహస్య గూఢచారి బృందం 'ది బేస్‌మెంట్' చుట్టూ తిరుగుతుంది. ఇందులో శిక్షణ పొందిన ఏజెంట్లు వారి సంబంధిత రంగాలలోని ప్రముఖులు. ది బేస్ మెంట్ టీమ్ ఏం చేసిందన్నదే సినిమా. హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.