వచ్చే ఏడాది మోగబోయేది థమన్ బ్యాండ్..!
కానీ థమన్ వద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి.
సినిమా ఇండస్ట్రీలో 'బాయ్స్' సినిమా ద్వారా నటుడిగా అడుగు పెట్టిన థమన్ ఆ తర్వాత సంగీత దర్శకుడిగా మారాడు. నటుడిగా కంటే సంగీత దర్శకుడిగా థమన్ కి మంచి పేరు వచ్చింది. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్న థమన్ చేతిలో ఎప్పుడూ అర డజను సినిమాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో అనిరుధ్ వల్ల థమన్ సినిమాల సంఖ్య తగ్గుతున్నాయని కొందరు భావిస్తున్నారు. కానీ థమన్ వద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. సోషల్ మీడియాలో థమన్ పేరు ఎప్పుడూ ఏదో విధంగా మోగుతూనే ఉంటుంది. తాజాగా అఖండ 2 కి సంగీత దర్శకుడిగా థమన్ ఎంపిక అయ్యాడు.
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 సినిమాకు థమన్ సంగీతాన్ని అందించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. థమన్ అఖండ సినిమాకు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు స్పీకర్స్ బద్దలు అయ్యాయి. అప్పటి నుంచి బాలయ్య కు థమన్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే అఖండ మొదలుకుని వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల కోసం థమన్ తో వర్క్ చేశాడు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న బాలయ్య సినిమాకు సైతం థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాకు సైతం థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
2024 సంవత్సరంలో థమన్ సంగీతం అందించిన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అందులో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అలాగే థమన్ పాటలకు పెద్దగా క్రేజ్ దక్కలేదు. కానీ రాబోయే ఏడాది థమన్ పాటలతో మారు మ్రోగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే ఏడాదిలో థమన్ సంగీతం అందిస్తున్న సినిమాలు పెద్దవి నాలుగు అయిదు విడుదల అవ్వబోతున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఒకటి అనే విషయం తెల్సిందే. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.
ఇతర భాషల నుంచి ఎంత మంది సంగీత దర్శకులు వచ్చినా థమన్ కి మినిమం ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కనుక ముందు ముందు ఆయన నుంచి వరుసగా సినిమాలు వస్తాయి. వచ్చే ఏడాదిలో ఆయన పేరుతో పాటు పాటలు మోగడం ఖాయం అనే విశ్వాసంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. థమన్ పాటలు గతంలో మాదిరిగా హిట్ అవ్వడం లేదని కొందరు అంటూ ఉన్న నేపథ్యంలో తన పంథాను మార్చుకుని కొత్తగా సంగీతాన్ని ఇచ్చేందుకు థమన్ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ లో థమన్ పాటలు వచ్చే ఏడాది మారు మ్రోగడం ఖాయం.