ఈసారి సంక్రాంతి రాజన్నదేనా?

ఈ సంక్రాంతి మాత్రం నిర్మాత దిల్ రాజు చుట్టూనే తిరగబోతోంది.

Update: 2024-10-15 05:49 GMT

టాలీవుడ్ లో సంక్రాంతి పండుగను సినిమాలకు అతి పెద్ద సీజన్ గా భావిస్తుంటారు. 2025 పొంగల్ కు కూడా గట్టి పోటీ ఉండబోతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ లాంటి అగ్ర హీరోలు ఈసారి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. ఎంతమంది స్టార్స్ పోటీలో ఉన్నా ఈ సంక్రాంతి మాత్రం నిర్మాత దిల్ రాజు చుట్టూనే తిరగబోతోంది. ఎందుకంటే ఆయన్నుంచి మూడు సినిమాలు ఫెస్టివల్ సీజన్ లో రాబోతున్నాయి.

దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2024 జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నిజానికి ఇది అప్పుడెప్పుడో 'విశ్వంభర' లాక్ చేసుకున్న డేట్. కానీ తనయుడి సినిమా కోసం చిరంజీవి రేసు నుంచి తప్పుకున్నారు. దిల్ రాజు రిక్వెస్ట్ మేరకు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు తమ చిత్రాన్ని వాయిదా వేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'NBK 109' చిత్రాన్ని కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. డైరెక్టర్ బాబీ కొల్లు రూపొందిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మేజర్ ఏరియాలలో ఈ మూవీని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఆయన నిర్మిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని కూడా టైటిల్ కు తగ్గట్టుగా అదే పండక్కి విడుదల చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇలా 2025 సంక్రాంతికి దిల్ రాజు నుంచి మూడు సినిమాలు వస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అన్ని మూవీస్ కి థియేటర్లు ఎలా సర్దుబాటు చేసుకుంటారు? ఇతర సినిమాలకు ఎలా అడ్జస్ట్ చేస్తారో? వాటిల్లో ఏది పొంగల్ విన్నర్ గా నిలుస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మూడింటిలో ఏదైనా ఒక సినిమా రిజల్ట్ తేడా కొట్టినా, మిగతా రెండు చిత్రాల ద్వారా బ్యాలన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దిల్ రాజు సేఫ్ సైడ్ లోనే ఉంటారు.

ఒకప్పుడు నిర్మాత ఎమ్మెస్ రాజును 'సంక్రాంతి రాజు' అని పిలుచుకునే వారు. ప్రతీ పండుగకు ఆయన బ్యానర్ నుంచి సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకునేవారు. వాటిల్లో ఎక్కువ శాతం హిట్లే ఉన్నాయి. ఇటీవల కాలంలో దిల్ రాజును సంక్రాంతి రాజు అని అంటున్నారు. సంక్రాంతికి అల్లుళ్ళు వచ్చినట్లు ప్రతి సీజన్ కి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా వచ్చేలా చూసుకుంటున్నారు. ఆయన నిర్మించిన సినిమాలు లేకపోయినా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న చిత్రాలైనా ఫెస్టివల్ కు రావడం ఆనవాయితీగా మారిపోయింది. కానీ ఈసారి ఏకంగా మూడు క్రేజీ చిత్రాలతో వస్తున్నారు. మరి ఏవేవి దిల్రాజును 'సంక్రాంతి రాజు'గా నిలబెడతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News