కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం.. సినీ ఇండస్ట్రీని వివాదాల్లోకి లాగొద్దు: దిల్ రాజు

సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంపై కేటీఆర్‌ వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు.

Update: 2024-12-31 14:06 GMT

ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే సినిమా వాళ్ల గురించి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని, వాళ్లతో సెటిల్ చేసుకున్న తర్వాత ఏం మాట్లాడట్లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు తాజాగా కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించారు. సీఎంతో సినీ ప్రముఖుల సమావేశంపై కేటీఆర్‌ వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.


"గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. గౌరవ సీఎం గారితో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెల్సిందే. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం గారు కాంక్షించారు"

"హైదరాబాదును గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చదిద్దాలనే సీఎం గారి బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది. కాబట్టి అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరిని కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం" అని దిల్‌ రాజు పేర్కొన్నారు.

హీరో అల్లు అర్జున్ వివాదం, సినీ ఇండస్ట్రీలో సమస్యల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ అయ్యారు. సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పని చేయాలనేది ఈ మీటింగ్ అజెండా అని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. అయితే కేటీఆర్ రీసెంట్ గా బన్నీ ఇష్యూ పై మరోసారి స్పందిస్తూ.. కేవలం ప్రచారం కోసం, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి సినిమా వాళ్ల గురించి మాట్లాడుతున్నారని కామెంట్లు చేశారు. అటెన్షన్‌ కోసం, డైవర్షన్‌ కోసం సీఎం పాకులాడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ప్రముఖులతో రేవంత్‌ రెడ్డి సెటిల్ చేసుకొని ఇప్పుడు ఏం మాట్లాడటం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ కామెంట్స్ పై దిల్‌ రాజు స్పందించారు.

Tags:    

Similar News