ఐటీ అధికారుల కారులో దిల్ రాజు... ఎక్కడికి తీసుకెళ్లారంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే

Update: 2025-01-24 07:12 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ప్రధానంగా.. సంక్రాంతికి విడుదలైన సినిమాల బడ్జెట్ లెక్కలు, కలెక్షన్స్ వివరాలు, జరుగుతున్న ప్రచారాల కారణంగా ఈ దాడులు జరిగినట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో సుమారు 200 మంది వరకూ అధికారులు దిల్ రాజు, ఆయన కుమార్తె హన్సితా రెడ్డి, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, అభిషేక్ అగర్వాల్ లతో పాటు డైరెక్టర్ సుకుమార్, మొదలైన వారి నివాసాలు, ఆఫీసులపై సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం కూడా దిల్ రాజ్ ఇంట్లో సోదాలు కొనసాగాయి.

అవును... ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారుల సోదాలు గురువారం ముగిశాయి. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఇంట్లో సోదాలు గురువారం కూడా కొన్ని గంటలు కొనసాగిన తర్వాత పూర్తయ్యాయని చెబుతున్నారు.

ఈ క్రమంలో... ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ ని, బ్యాంక్ లాకర్లను ఐటీ అధికారులు పరిశీలించినట్లు చెబుతున్నారు! అనంతరం గురువారం మధ్యాహ్నం సమయంలో దిల్ రాజును ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ విషయం ఒక్కసారిగా కలకలం రేపింది.

ప్రధానంగా సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలతో పాటు గత రెండేళ్లుగా దిల్ రాజు నిర్మించిన సినిమాలకు సంబంధించి వచ్చిన లాభాలపై ఐటీ అధికారులు ఆరాతీశారని తెలుస్తోంది. ఇదే సమయంలో దిల్ రాజు సోదరుడు విజయ సింహారెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని అంటున్నారు.

ఈ సందర్భంగా పలు పత్రాలను అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఐటీ అధికారులు దిల్ రాజు నివాసం నుంచి ఆయన ఆఫీసుకు వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజును తమ వాహనంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ ఆఫీసుకు తీసుకెళ్లారనే విషయం హట్ టాపిక్ గా మారింది!

Tags:    

Similar News