దిల్ రాజు కొత్త ప్రయోగం.. సినిమా ఇండస్ట్రీలో AI స్టూడియో!

ప్రపంచ స్థాయి మేధస్సుతో పనిచేస్తున్న క్వాంటమ్ ఏఐ గ్లోబల్ అనే సంస్థతో కలిసి దిల్ రాజు ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.;

Update: 2025-04-16 06:38 GMT
Dil Raju Launch AI Studio

టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్ మొదలుపెట్టబోతున్నారు. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన ఈ ప్రముఖ నిర్మాత, ఈసారి ఒక సినిమాతో కాదు… ఏకంగా ఓ కొత్త టెక్నాలజీ సంస్థను ప్రారంభించేందుకు రంగంలోకి దిగారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఆయన తీసుకున్న ఈ అడుగు, పరిశ్రమ మొత్తానికీ మార్గదర్శకంగా నిలవనుంది.

ప్రపంచ స్థాయి మేధస్సుతో పనిచేస్తున్న క్వాంటమ్ ఏఐ గ్లోబల్ అనే సంస్థతో కలిసి దిల్ రాజు ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉండబోతోంది. ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కోసం ప్రత్యేకంగా రూపొందించే టూల్స్‌ను అభివృద్ధి చేయాలనే దిశగా ఇది ముందుకు సాగుతోంది. సినిమాల ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకూ, ఎడిటింగ్, డబ్బింగ్, విజువల్స్, వీఎఫ్ఎక్స్ వంటి విభాగాల్లో ఆధునిక టెక్నాలజీతో మార్పులు తెచ్చే ప్రయత్నం ఇది.

ఈ ప్రతిష్టాత్మక ఎకోసిస్టమ్‌ను ‘AI స్టూడియో’ అనే ప్రత్యేక బ్రాండ్‌గా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థను మే 4న అధికారికంగా ప్రారంభించబోతున్నారు. “లైట్స్.. కెమెరా.. ఇంటెలిజెన్స్” అనే క్యాప్షన్‌తో పోస్టర్ విడుదల చేయడంతో, ఇది సినిమాల్లో టెక్నాలజీ వినియోగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నదనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకూ మనం చూసిన ట్రెడిషనల్ మూవీ మేకింగ్ పద్ధతుల్ని ఇది పూర్తిగా మార్చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ కొత్త ప్రయత్నం వెనుక ఉన్న విజన్ ను వివరించేందుకు దిల్ రాజు ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. 1913లో మొదటి సినిమాతో భారతదేశం వెండితెరపై ప్రేమలో పడిందని గుర్తు చేస్తూ.. ఇప్పుడు 2025లో ఆ ప్రేమను ఇంటెలిజెన్స్‌తో కలిపి మరో విప్లవానికి నాంది పలుకుతున్నామని తెలిపారు. 1931లో తొలి టాకీ చిత్రం నుంచి 1995లో వీఎఫ్ఎక్స్ సినిమాల వరకు ఇండియన్ సినిమా చేసిన ప్రయాణాన్ని చూపిస్తూ, AI స్టూడియో దీని తర్వాతి దశ అని స్పష్టం చేశారు.

ఇప్పటికే ప్రీ లాంచ్ వీడియోలో 'బాహుబలి', 'ఆదిపురుష్', 'పుష్ప' వంటి హై టెక్నికల్ సినిమాలను చూపిస్తూ, రాబోయే సినిమాలకు మరింత హై ఎండ్ టెక్నాలజీ అందుబాటులోకి రానుందని సూచించారు. ఒక ప్రముఖ నిర్మాత చేతిలో ఒక విజువల్ టెక్ బ్రాండ్ ఏర్పడడం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి. ఇది భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే చరిత్రాత్మక ప్రయత్నంగా భావిస్తున్నారు. మారుతున్న ప్రపంచంలో టెక్నాలజీ అంచులను వెంబడిస్తూ సినిమాకు కొత్త రూపాన్ని అందించేందుకు ఈ ప్రయత్నం ఎంతటి విప్లవాత్మకంగా మారుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News