పబ్లిక్ టాక్ ను అడ్డుకుంటారా? అది అయ్యే పనేనా?
అసలు డిజిటల్ యుగంలో పబ్లిక్ టాక్ ను, రివ్యూలను అడ్డుకోవడం అసలు అయ్యే పనేనా?. థియేటర్ల ఆవరణలోకి యూట్యూబ్ ఛానళ్లను రానివ్వకుండా ఉంటే సమస్య పరిష్కారం అవుతుందా?.
థియేటర్ల పరిసరాల్లో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే యూట్యూబ్ ఛానల్స్ ను నియంత్రించాలని తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ టాక్ పేరుతో థియేటర్ల వద్ద రివ్యూలు ఇవ్వడం సినిమా ఫలితంపై ఎఫెక్ట్ చూపిస్తోందని.. 'ఇండియన్ 2', 'వేట్టయన్' 'కంగువ' సినిమాలను దీనికి ఉదాహరణగా పేర్కొంది. అందుకే ఇకపై థియేటర్ యజమానులు యూట్యూబ్ ఛానళ్లను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. అయితే దీన్ని తెలుగు రాష్ట్రాల్లోనూ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అగ్ర నిర్మాత దిల్ రాజు హింట్ ఇచ్చారు.
'సంక్రాంతికి వస్తున్నాం' ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. "తమిళనాడులో అది సక్సెస్ ఫుల్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా మన స్టేట్స్ లోనూ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అది ఇండిపెండెంట్ గా తీసుకునే నిర్ణయం కాదు. ఛాంబర్ ద్వారా జరగాలి. ఆల్రెడీ దీనికి ఎగ్జిబిటర్స్ కూడా ప్రిపేర్ అయ్యారు" అని అన్నారు. సో కోలీవుడ్ మాదిరిగానే టాలీవుడ్ లో కూడా థియేటర్ల దగ్గర ఆడియన్స్ నుంచి సినిమా టాక్ తెలుసుకోడాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయని అర్థమవుతోంది.
థియేటర్ల వద్ద పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడం అనేది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. సోషల్ మీడియా ఇంత విస్తృతంగా లేని రోజుల్లోనే ఈ విధానం ఉంది. అప్పట్లో చిత్ర బృందమే సినిమా హాళ్ళ బయట ప్రేక్షకుల అభిప్రాయాని రికార్డింగ్ చేసి, పాజిటివ్ గా ఇచ్చిన రివ్యూలను టీవీ ఛానల్స్ లో ప్రమోట్ చేసుకునేవారు. యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత కూడా ఇది అలానే కొనసాగుతూ వచ్చింది. అయితే ఒకప్పుడు పబ్లిక్ ఒపీనియన్స్ ను పాజిటివ్ గా భావించిన ఫిలిం మేకర్స్.. ఇప్పుడు మాత్రం సినిమాపై ప్రభావం చూపిస్తున్నాయని భావిస్తుండటం గమనార్హం.
అసలు డిజిటల్ యుగంలో పబ్లిక్ టాక్ ను, రివ్యూలను అడ్డుకోవడం అసలు అయ్యే పనేనా?. థియేటర్ల ఆవరణలోకి యూట్యూబ్ ఛానళ్లను రానివ్వకుండా ఉంటే సమస్య పరిష్కారం అవుతుందా?. ఎందుకంటే సినిమా హాల్స్ దగ్గర పబ్లిక్ రివ్యూలను అడ్డుకోవచ్చు కానీ.. ఆడియన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లలో పెట్టే పోస్టులను ఎలా అడ్డుకోగలం?. యూట్యూబ్ లో సినిమాపై తన అభిప్రాయాన్ని వీడియో రూపంలో పెట్టడాన్ని ఎలా ఆపగలం?.
నిజానికి ఏ సినిమాకైనా మౌత్ టాక్ అనేది చాలా కీలకం. పెద్ద సినిమాల సంగతేమో కానీ, చిన్న చిత్రాలకు మాత్రం పబ్లిక్ టాక్ చాలా హెల్ప్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్స్ థియేటర్ల వద్ద ప్రేక్షకుల ఒపీనియన్స్ తెలుసుకొని వీడియో చేయటం వల్ల, చిన్న సినిమాలకు సులభంగా మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అయినా సోషల్ మీడియా, యూట్యూబ్ రివ్యూలు లేని రోజుల్లో అన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలే రాలేదు కదా?. అప్పుడు కూడా హిట్ సినిమాలు ఉన్నట్లే, డిజాస్టర్లు కూడా ఉన్నాయనే సంగతి మర్చిపోతే ఎలా?.
కాకపోతే అన్ని చోట్లా ఉన్నట్లే, ఇక్కడ కూడా పక్కదారి పట్టిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సినిమా రివ్యూల పేరుతో వ్యక్తిగత దాడులకు దిగడం, విద్వేషాలను రెచ్చగొట్టడటం లాంటివి చేస్తున్నాయి. హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలపై నెగిటివ్ కామెంట్లు చేస్తూ.. వ్యూస్ కోసం రకరకాల థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోలను వైరల్ చేస్తున్నారు. సినిమా మీద ఏమాత్రం అవగహన లేనివారు కూడా సమీక్షకులుగా మారి, సినిమాని రివ్యూ చేస్తున్నారు. అసలు ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేకుండానే సినిమాని సమీక్షించేస్తున్నారు.. విమర్శలు చేస్తున్నారు.
అలా అని ఇక్కడ అందరినీ ఒకే గాటికి కట్టేయడం సరికాదు. పనిగట్టుకొని సినిమాపై నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేసేవాళ్ళు ఉన్నట్లే, మంచి సినిమాని నిజాయితీగా జనాల్లోకి తీసుకెళ్లే యుట్యూబ్ చానల్స్ కూడా ఉన్నాయి. నిజంగా బాగున్న సినిమాకి పాజిటివ్ టాక్ ను తీసుకెళ్తూ, ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడానికి తమవంతు సహాయం చేస్తున్నారు. కాబట్టి అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఒకటే అనే విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి దీనిపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.