దిల్ రాజుకు పెద్ద సమస్యే వచ్చి పడిందే..?!
అయితే అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న దిల్ రాజుకు ఇప్పుడు 'విడాముయార్చి' రూపంలో ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
2025 సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. ఆయన ప్రొడక్షన్ లో 'గేమ్ చేంజర్' & 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి రెండు సినిమాలు వస్తుంటే.. డిస్ట్రిబ్యూషన్ ద్వారా 'డాకు మహారాజ్' మూవీ థియేటర్లలోకి వస్తోంది. పండగ మీద పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన అగ్ర నిర్మాత.. అన్ని సినిమాలను సేఫ్ గా ల్యాండ్ చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా సినిమాకి రెండు రోజుల గ్యాప్ ఉండేలా రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నారు. అయితే అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న దిల్ రాజుకు ఇప్పుడు 'విడాముయార్చి' రూపంలో ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న 'విడాముయార్చి' చిత్రాన్ని 2025 పొంగల్ కి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా టీజర్ కూడా లాంచ్ చేసారు. అజిత్ తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఈ సినిమాని తెలుగులో విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనేది పక్కన పెడితే.. తమిళనాడులో మాత్రం అధిక థియేటర్లలోనే ఈ సినిమా విడుదల అవుతుంది. అదే జరిగితే అక్కడ 'గేమ్ చేంజర్' ఓపెనింగ్స్ పై గట్టి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
2023 సంక్రాంతికి విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'వారసుడు', అజిత్ నటించిన 'తెగింపు' సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా హీరో పెద్ద కాబట్టి తమిళనాడులో ఎక్కువ థియేటర్లు కేటాయిస్తే బాగుంటుంది' అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అజిత్ ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేశాయి. మామూలుగానే అక్కడ విజయ్, అజిత్ అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుంటుంది అనే రేంజ్ లో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి. అలాంటిది అజిత్ కంటే విజయ్ గొప్ప అనే విధంగా దిల్ రాజు మాట్లాడటంపై అజిత్ అభిమానులు అప్పట్లో ఫైర్ అయ్యారు.
కట్ చేస్తే రాబోయే సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన 'గేమ్ చేంజర్' సినిమాకి పోటీగా అజిత్ 'విడాముయార్చి' సినిమా బరిలో దిగుతోంది. ఇది దిల్ రాజుతో క్లాష్ అనే విధంగా అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ ఉన్నారు కాబట్టి, మిగతా భాషల్లో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ తమిళ్ లో మాత్రం అజిత్ సినిమా నుంచి చాలా గట్టి పోటీ ఎదురవుతుంది. ఆదిత్య రామ్ తో కలిసి తమిళ్ లో 'గేమ్ ఛేంజర్' సినిమాను విడుదల చేస్తున్న దిల్ రాజుకు ఇది పెద్ద సమస్యే అనుకోవాలి.
'గేమ్ ఛేంజర్' మీద దిల్ రాజు భారీగానే ఖర్చు పెట్టారు. తమ బ్యానర్ లో మైలురాయి 50 సినిమా కావడంతో బడ్జెట్ కు ఏమాత్రం వెనకాడలేదు. మంచి ఓపెనింగ్స్ కోసం 'విశ్వంభర' లాంటి మెగా మూవీని కూడా వాయిదా వేసుకునేలా చర్చలు జరిపారు. తెలుగులో 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలకు కూడా థియేటర్లు అడ్జస్ట్ చేస్తున్నారు. అంతా బాగానే ఉందని అనుకుంటున్న టైంలో తమిళ్ లో అజిత్ మూవీతో క్లాష్ కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చూద్దాం.. మరి బాక్సాఫీస్ వద్ద ఏమి జరుగుతుందో.