వివాదాస్పద కథతో పాన్ వరల్డ్‌ని టార్గెట్ చేసిన గాయకుడు
దిల్జీత్ రూపొందించిన వివాదాస్పద చిత్రం `పంజాబ్ 95` ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ చిత్రంతో పంజాబీ మూలాలను, చరిత్రను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు.
పాన్ ఇండియాలో సత్తా చాటాలంటే ఏదో ఒక వివాదం కూడా కలిసి రావాలి. చూస్తుంటే ఇప్పుడు ప్రముఖ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ అలాంటి ఒక ప్రయత్నంలో ఉన్నట్టే కనిపిస్తోంది. గాయకుడుగా ఇప్పటికే అతడు అసాధారణ స్టార్‌డమ్‌ని ఆస్వాధిస్తున్నాడు. నటుడిగాను అతడికి గొప్ప క్రేజ్ ఉంది. అయితే అతడికి ఇప్పుడు కావాల్సింది పాన్ ఇండియన్ స్టార్ డమ్. చూస్తుండగానే అతడు ఒక వివాదాస్పద సబ్జెక్ట్ ని ఎంచుకుని దేశవ్యాప్తంగా చర్చల్లోకి వస్తున్నాడు.
దిల్జీత్ రూపొందించిన వివాదాస్పద చిత్రం `పంజాబ్ 95` ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ చిత్రంతో పంజాబీ మూలాలను, చరిత్రను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. పంజాబ్ చీకటి చరిత్రను, దురాగతాలను ఎదుర్కొన్న ప్రజల కన్నీటి కథను ఈ సినిమా తెరపై ఆవిష్కరిస్తుంది. నిజ ఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం `ఆపరేషన్ బ్లూస్టార్` ఆధారంగా రూపొందింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య నుండి పంజాబ్ ముఖ్యమంత్రి హత్య వరకూ.. 1984 అల్లర్లు, నాటి రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన లెక్కలేనంత మంది అమాయకుల కథలను హైలైట్ చేస్తూ తెర రూపమిచ్చారు. హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించారు.
నిజానికి ఈ టైటిల్ పంజాబ్ కథను ఆవిష్కరిస్తున్నా కానీ, దేశవ్యాప్తంగా ప్రజల్లో సేలబుల్ పాయింట్ ని దిల్జీత్ దోసాంజ్ ఎంపిక చేసుకున్నాడు. ఇందిరా గాంధీ కథతో ప్యారలల్ గా పంజాబ్ అస్తిత్వాన్ని ప్రజలకు తెలియజేసే వివాదాస్పద కంటెంట్ తో ఇది రూపొందింది. ఈ మూవీ టీజర్‌ను షేర్ చేయడంతో నెటిజనులు, దిల్జీత్ అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. పంజాబ్ పోలీసులు 25 వేల చట్టవిరుద్ధ హత్యలు, అమాయకుల అదృశ్యాలు, రహస్య దహన సంస్కారాలపై పరిశోధించిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా (దిల్జిత్ పోషించిన) జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జస్వంత్ సింగ్ తన పరిశోధనలో ఎన్నో కఠోరమైన నిజాల్ని నిగ్గు తేల్చారు. ఆ తర్వాత హత్యకు గురయ్యాడు. అతడి నిజ కథతో తీసిన పంజాబ్ 95 సినిమా 2023లో పూర్తయింది. కానీ సెన్సార్ నిబంధనల కారణంగా రిలీజ్ కాకుండా నిలిచిపోయింది.
భారతదేశంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ సినిమాలో 120 కట్‌లను ప్రతిపాదించింది. సున్నితమైన విషయం కావడంతో సినిమా ప్రదర్శనపై అనుమానాలేర్పడ్డాయి. అయితే దిల్జిత్ పట్టుదలగా సమస్యల్ని పరిష్కరించుకుని ఇప్పుడు అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ఎటువంటి కట్‌లు లేకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని దిల్జిత్ ప్రకటించారు. టీజర్‌ను షేర్ చేస్తూ, పంజాబ్ 95 సినిమాస్ లో ఫిబ్రవరి 7న విడుదలవుతుంది అని ప్రకటించాడు. ఈ సినిమా పోస్టర్ లో దిల్జిత్ దోసాంజ్ సాధారణ కుర్తా, తలపాగా ధరించి గాయాలతో నేలపై కూర్చుని కనిపించాడు. ఈ పోస్టర్ కి అద్భుత స్పందన వచ్చింది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రలో నటించాడు.