'డిస్ట్రిబ్యూటర్' దిల్ రాజు.. సచిన్ ఫార్ములా..

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే.

Update: 2024-09-03 05:22 GMT

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్‌ గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన.. దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. సూపర్ హిట్ సినిమాలు నిర్మించి టాప్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు. అనేక బ్లాక్ బస్టర్ హిట్లు రూపొందించి మెప్పించారు. నిర్మాతగా ఎదిగినా.. డిస్ట్రిబ్యూషన్ ను విడిచిపెట్టలేదు. నైజాంలో తనకు మించిన డిస్ట్రిబ్యూటర్ లేరని నిరూపించుకున్నారు!

అయితే డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఈ మధ్య దిల్ రాజు కాస్త నెమ్మదించారని కొద్దిరోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై యంగ్ హీరో సుహాస్ అప్ కమింగ్ మూవీ జనక అయితే గనక ప్రెస్ మీట్ లో ఆయనకు ప్రశ్నకు ఎదురైంది. దీంతో తనదైన శైలిలో స్పందించారు. తాను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లాంటి వాడినని తెలిపారు. దాంతోపాటు మాస్టర్ బ్లాస్టర్ ఫార్ములా ఫాలో అవుతున్నానని దిల్ రాజు చెప్పారు.

"ఎప్పుడైనా సచిన్ ఆడేటప్పుడు బంతిని బాగా పరిశీలిస్తాడు.. లూజ్ బాల్ కోసం వెయిట్ చేస్తుంటాడు.. అలాగే నేను కూడా రైట్ టైమ్ కోసం ఎదురుచూస్తున్నాను.. అనుకున్న బంతి సచిన్ కు దొరికితే సిక్సర్ అవుతుంది. సచిన్ ఫార్ములా లాగే నాది కూడా.. సరైన బంతిలాగా సరైన మూవీ కోసం వేచి ఉండాలి.. ప్రజెంట్ నేను పరిస్థితులు ఆరా తీస్తున్నాను.. నా ప్రొడక్షన్ హౌస్ ద్వారా భారీ సినిమాలు తీస్తున్నాం" అని తెలిపారు దిల్ రాజు.

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దిల్ రాజు.. టైమింగ్ అదుర్స్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే దిల్ రాజు.. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం మూవీని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. మంచి టాక్ అందుకుని దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు అందుకుని అలరిస్తోంది.

ఇక జనక అయితే గనక సినిమా విషయానికొస్తే.. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సందీప్ బండ్ల దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీలో సుహాస్ కు జోడీగా సంగీర్తన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకోగా.. సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీతో సుహాస్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News