అగ్ర నిర్మాత ఆశలన్నీ ఆ సినిమాలపైనే!

2025 సంక్రాంతికి విడుదలయ్యే నాలుగు సినిమాల్లో మూడు దిల్ రాజుకి చెందినవే ఉండటం గమనార్హం

Update: 2024-11-09 09:30 GMT

సంక్రాంతి సీజన్ కు నాలుగు పెద్ద సినిమాలను తట్టుకునే శక్తి ఉంటుంది. గత కొన్నేళ్ళ నుంచి టాలీవుడ్ లో పండుగకు నాలుగు సినిమాలను విడుదల చేస్తూ, థియేటర్లు సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది పొంగల్ కు వచ్చే మూవీస్ విషయంలో క్లారిటీ వస్తోంది. 'గేమ్ ఛేంజర్', 'NBK 109', 'సంక్రాంతికి వస్తున్నాం', 'మజాకా' వంటి చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దిగడానికి రెడీ అవుతున్నాయి. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే తమిళ్ డబ్బింగ్ మూవీ కూడా వస్తుందని అంటున్నారు కానీ, దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

2025 సంక్రాంతికి విడుదలయ్యే నాలుగు సినిమాల్లో మూడు దిల్ రాజుకి చెందినవే ఉండటం గమనార్హం. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్', వెంకటేశ్ చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఆయనే నిర్మిస్తున్నారు. అలాగే, సితార బ్యానర్ లో రూపొందుతున్న నందమూరి బాలకృష్ణ 109వ చిత్రానికి నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. కాబట్టి ఈ ఫెస్టివల్ సీజన్ లో దిల్ రాజుకు అటు నిర్మాతగా, ఇటు పంపిణీదారుడిగా చాలా కీలకంగా మారనుంది.

2023 సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్ లో 'వాల్తేరు వీరయ్య' 'వీర సింహారెడ్డి' చిత్రాలను రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు. ఒకే ప్రొడక్షన్ హోస్ లో రూపొందిన రెండు సినిమాకు ఒకేసారి విడుదల చెడడం టాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పుడు 2025 సంక్రాంతికి దిల్ రాజు సైతం తన సినిమాకి తన చిత్రాన్నే పోటీగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. మైత్రీ మాదిరిగానే రెండు చిత్రాలను సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేసి, అరుదైన ఫీట్ ను అందుకోవాలని చూస్తున్నారు.

నిజానికి ఈ మధ్యకాలంలో దిల్ రాజు ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నారు. 'బలగం' తర్వాత ఆ రేంజ్ లో హిట్టు కొట్టలేకపోయారు. థాంక్యూ, శాకుంతలం, ఫ్యామిలీ స్టార్, లవ్ మీ, జనక అయితే గనక లాంటి సినిమాలు తీవ్ర నిరాశ పరిచాయి. బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయ్యాయి. అటు డిస్ట్రిబ్యూషన్ లోనూ లాభాలు రాలేదు. దీంతో ఆయన జడ్జిమెంట్ మీద జనాల్లో నమ్మకం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ ట్రాక్ లోకి రావడానికి 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం', NBK109 సినిమాలు కీలకంగా మారాయి.

దిల్ రాజు బ్యానర్ లో వస్తోన్న 50వ చిత్రం 'గేమ్ ఛేంజర్'. గోల్డెన్ జూబ్లీ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శంకర్ లాంటి దర్శకుడితో, బడ్జెట్ కు ఏమాత్రం వెనకాడకుండా భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్టయితే తన బ్యానర్ కు పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నారు. అలానే వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వస్తోన్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 'ఎఫ్ 2' రిజల్ట్ ను రిపీట్ చేస్తుందని నమ్ముతున్నారు. బాలయ్య సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గానూ విజయం సాధించాలని చూస్తున్నారు.

మొత్తం మీద సంక్రాంతిని సెంటిమెంట్ గా భావించే నిర్మాత దిల్ రాజు.. ఈసారి పండుగను నమ్ముకొని వందల కోట్ల పెట్టుబడి పెట్టారు. ఒకేసారి మూడు సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఒక విధంగా ఇది రిస్క్ అని కూడా చెప్పాలి. ఏమాత్రం తేడా కొట్టినా బ్యానర్ కు పెద్ద దెబ్బ పడుతుంది. మూడూ హిట్టయితే మాత్రం ఎప్పటిలాగే ఇండస్ట్రీలో నిర్మాత హవా కంటిన్యూ అవుతుంది. పొరపాటున వాటిల్లో ఒక్క సినిమా రిజల్ట్ వేరేగా వచ్చినా, మిగతా సినిమాలు దాన్ని రికవరీ చెయ్యాల్సి ఉంటుంది. మరి దిల్ రాజుకు ఈ సీజన్ ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో, సంక్రాంతి రాజు అనిపించుకుంటారో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News