దర్శకుడి ఆత్మహత్య.. మొబైల్‌లో రహస్యం?
గురుప్రసాద్ ఆర్థిక వ్యవహారాలను అన్వేషించడానికి అతడి బ్యాంక్ ఖాతా వివరాలను సమీక్షించాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 4 Nov 2024 11:30 PM GMTకన్నడ సినీ దర్శకుడు గురుప్రసాద్ అకాల మరణం నేపథ్యంలో ఆయన మృతికి సంబంధించిన పరిస్థితులను పరిశోధించేందుకు పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. బెంగళూరులోని మదనాయకనహళ్లి పోలీసులు అతడి నివాసంలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. డెత్ నోట్ సహా ఏవైనా ఆధారాల లభ్యత కోసం వెతుకుతున్నారు. అయితే వారికి ఎటువంటి లేఖ (సూసైడ్ నోట్) లభించలేదని తెలిసింది.
గురుప్రసాద్ ఫ్లాట్‌లో నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ను అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు తెలిసింది. గత నాలుగు రోజులుగా ఛార్జ్ చేయని కారణంగా ఫోన్లు స్విచ్ఛాఫ్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అతడి మరణానికి దారితీసిన సంఘటనలపై ఈ గాడ్జెట్‌ల నుండి డేటా ఏదైనా లభిస్తుందని భావిస్తున్నారు. ఈ పరికరాలను వివరణాత్మక విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతను చనిపోయే కొద్దిసేపటి ముందు మొబైల్ ఫోన్‌లలో ఏవైనా వీడియోలు రికార్డ్ చేసి ఉంటే అవి అతని మరణం వెనుక గల కారణాలను వెలుగులోకి తెస్తాయని భావిస్తున్నారు.
వ్యక్తిగత పోరాటాలు ..
గురుప్రసాద్ ఆర్థిక ఇబ్బందులకు సంబంధించిన డిప్రెషన్‌తో పోరాడుతున్నాడని అతని భార్య వెల్లడించడంతో దర్యాప్తు వ్యక్తిగత మలుపు తిరిగింది. గురు ప్రసాద్ మొదటి భార్యకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు రెండో భార్యకు దూరంగా ఉంటున్నారు. కుటుంబ సమస్యలు ఆయనను వేధిస్తున్నాయని పోలీసులు కనుగొన్నారు. పోలీసులను ఈ క్లిష్టమైన కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా అతడి ప్రస్తుత భార్య ఇచ్చిన వివరాలు.. గురు ప్రసాద్ మానసిక ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిని లోతుగా పరిశోధించడానికి ప్రేరేపించాయి.
గత నెల రోజులుగా గురు ప్రసాద్ కి వచ్చిన కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్‌లను విశ్లేషించేందుకు మదనాయకనహళ్లి పోలీసులు గురుప్రసాద్ మొబైల్ ఫోన్‌ల పరిశీలనకు ప్రాధాన్యత ఇచ్చారు. అతడి మరణానికి ముందు బయటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు పని చేసాయి? తీవ్రమైన పరిస్థితి ఏదైనా ఉందా? అనేది విశ్లేషిస్తున్నారు. అతడి కాల్ హిస్టరీ, మెసేజ్ ఎక్స్ఛేంజ్ లు, వాట్సాప్ సంభాషణలపై డేటాను సేకరించాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎవరైనా అనవసరమైన ఒత్తిడి తెస్తూ వేధించినట్టు తెలిసినా అటువంటి వారిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
గురుప్రసాద్ ఆర్థిక వ్యవహారాలను అన్వేషించడానికి అతడి బ్యాంక్ ఖాతా వివరాలను సమీక్షించాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. అన్ని కోణాల్లో విశ్లేషణతో ఆర్థిక విచారణలను మాత్రమే కాకుండా అతడి వృత్తిపరమైన సంబంధాలు, వ్యక్తిగత విషయాలపై పరిశోధనలతో నిజాల్ని నిగ్గు తేల్చనున్నారు. ఎందుకంటే వారు అతని విషాద మరణం వెనుక ఉన్న సత్యాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు సాగుతున్న కొద్దీ, గురుప్రసాద్ మరణానికి దారితీసిన పరిస్థితులను సేకరించేందుకు అధికారులు కట్టుబడి ఉన్నారని తెలుస్తోంది. ఏం జరిగిందో తెలిస్తే అతడి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఒక స్పష్ఠత వస్తుందని ఆశ.
52 ఏళ్ల కన్నడ సినీ దర్శకుడు గురు ప్రసాద్ గత ఆదివారం నాడు నగర శివార్లలోని తాను నివశిస్తున్న ఇంటిలో ఉరివేసుకుని కనిపించాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అతడికి ఆర్థిక సమస్యలున్నాయని విన్నాం. సినిమా కెరీర్ అంత బాలేదు. ఐదారు రోజుల క్రితం అతను ఈ ఇంటికి రావడం ఇరుగుపొరుగు వారు చూశారు. ఆ తర్వాత అతడు బయటకు అడుగు పెట్టలేదు. ఐదు నుంచి ఆరు రోజుల క్రితమే ఉరి వేసుకుని చనిపోయాడని తెలుస్తోంది అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (బెంగళూరు రూరల్) సీకే బాబా తెలిపినట్లు పీటీఐ కథనం పేర్కొంది. పోలీసు వర్గాల ప్రకారం.. ఫ్లాట్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కుళ్ళిన స్థితిలో మృతదేహం కనిపించింది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు.
గురుప్రసాద్ సామాజిక ఇతివృత్తాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను తెరకెక్కించారు. మాత, యెడ్డెలు మంజునాథ చిత్రాలతో గుర్తింపు పొందారు. అతడు తెరకెక్కించిన రంగనాయక చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినా కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టరైంది. అతడికి 3 కోట్ల అప్పులు ఉన్నాయని, మధ్యతరగతి జీవి కనుక అప్పులు చెల్లించలేక ఒత్తిడికి గురయ్యాడని కూడా చెబుతున్నారు. అలాగే అతడు అప్పులోళ్ల బాధలు తాళలేక ఇల్లు మారుతుంటాడని కూడా సాక్షి కథనం పేర్కొంది.