ప్రభాస్‌ని సరిగ్గా వాడుకోవడం లేదన్న డైరెక్టర్‌!

ప్రభాస్ మంచి నటుడు అని, ఆయన్ను ఫిల్మ్‌ మేకర్స్‌ వాడుకోవడం లేదని అన్నారు.

Update: 2024-10-17 07:30 GMT

యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఎక్కువగా యాక్షన్ సినిమాలను చేస్తున్నారు. సాహో సినిమా నుంచి మొదలుకుని ఇటీవల వచ్చిన కల్కి వరకు ప్రతీ సినిమాలోనూ యాక్షన్‌ సన్నివేశాలతో అదరగొట్టాడు. అయితే యాక్షన్ అయితే బాగానే ఉంది కానీ, ఇప్పటివరకు ప్రభాస్ నుంచి మంచి నటన ప్రతిభ చూపించే సినిమా రాలేదు అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీ వ్యక్తం చేశారు. ప్రభాస్ మంచి నటుడు అని, ఆయన్ను ఫిల్మ్‌ మేకర్స్‌ వాడుకోవడం లేదని అన్నారు.

ఇటీవల క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ తన ఖడ్గం సినిమా రీ రిలీజ్ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో ప్రభాస్‌తో కలిసి కృష్ణవంశీ చక్రం సినిమాను రూపొందించారు. ఆ సినిమా కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్‌గా మాత్రం నిరాశ పరిచింది. ఆ సమయంలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ చక్రం సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచడం వల్ల మరో సినిమా వీరి కాంబోలో సెట్‌ అవ్వలేదు.

చక్రం సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయింది. తాజాగా అప్పటి విషయాలను దర్శకుడు కృష్ణవంశీ గుర్తు చేసుకున్నారు. ప్రభాస్‌తో సినిమాను చేసేందుకు చక్రంతో పాటు ఒక యాక్షన్‌ సినిమా కథను రెడీ చేసుకున్నాను. అప్పుడు చాలా మంది ప్రభాస్ వద్దకు యాక్షన్‌ కథలతో వచ్చారు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ అలాగే ఉన్నాయి. అందుకే కొత్తగా ఉంటుందనే ఉద్దేశ్యంతో చక్రం సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యాం. మా అందరి అంచనాలకు తగ్గట్లుగానే చక్రం సినిమా మంచి స్పందన దక్కించుకుంది.

ప్రభాస్‌లోని మంచి నటుడిని చక్రం సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశాను. అయితే ఇప్పుడు చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్ ఆయనలోని నటుడిని వాడుకోవడంలో విఫలం అవుతున్నారు. ఆయన్ను కేవలం యాక్షన్‌ సన్నివేశాలకే పరిమితం చేస్తున్నారు. ఎక్కువ శాతం ప్రభాస్‌ ను ఫైట్స్‌ లోనే చూపించడం వల్ల అతడి నటన ప్రతిభ మరుగున పడుతుందని దర్శకుడు కృష్ణవంశీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికి అయినా ప్రభాస్‌లోని నటుడిని వాడుకోవాలని దర్శకులకు కృష్ణవంశీ సూచిస్తున్నారు. ప్రభాస్‌ ప్రస్తుతం రాజాసాబ్‌, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నారు. ఆ తర్వాత స్పిరిట్‌, సలార్ 2, కల్కి 2 సినిమాలతో రాబోతున్నారు. ఆ సినిమాల్లో అయినా ప్రభాస్ యాక్షన్‌ కాకుండా నటన చూసే అవకాశం ఉంటుందేమో చూడాలి.

Tags:    

Similar News